రజనీకాంత్ "పార్టీ".. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా..?

డీఎంకే నేత కరుణానిధితో పాటు అన్నాడీఎంకే నేతలు ఎంజీ రామచంద్రన్‌, జయలలితలు కూడా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చినవారే. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాక,  తమిళనాడులో ద్రావిడవాదానికి బదులుగా అవినీతిపై పోరాటం చేయడమే తన ఎజెండా అని చెప్పే సరికొత్త రాజకీయాలు వస్తున్నాయని  చెప్పవచ్చు. ఈ సంకేతాలు దేశ రాజకీయాలకు కూడా అందుతాయనడంలో సందేహం లేదు. 

Last Updated : Jan 3, 2018, 03:44 PM IST
రజనీకాంత్ "పార్టీ".. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా..?

డీఎంకే నేత కరుణానిధితో పాటు అన్నాడీఎంకే నేతలు ఎంజీ రామచంద్రన్‌, జయలలితలు కూడా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చినవారే. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాక,  తమిళనాడులో ద్రావిడవాదానికి బదులుగా అవినీతిపై పోరాటం చేయడమే తన ఎజెండా అని చెప్పే సరికొత్త రాజకీయాలు వస్తున్నాయని  అంటున్నారు. ఈ సంకేతాలు దేశ రాజకీయాలకు కూడా అందుతాయనడంలో సందేహం లేదు. 

పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో అందరూ న్యూ ఇయర్ పార్టీలు చేసుకుంటుంటే.. రజనీకాంత్ మాత్రం రాజకీయ పార్టీ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులువు కాదని, ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలోనే రాజీనామా చేస్తాను అని ఆయన ప్రకటించడం విశేషం. ఈ క్రమంలో ఈ కొత్త పార్టీ దేశ రాజకీయాల్లో ఏ విధంగా దుమారం లేపుతుందనేది అన్నింటి కన్నా పెద్ద ప్రశ్నే.

ద్రావిడ రాజకీయాలకు రజనీకాంత్ కొత్త పార్టీ కౌంటరా..?
తమిళనాడులో పలు దశాబ్దాల నుండి డీఎంకే (ద్రావిడ మున్నేత్ర కళగం) మరియు అన్నాడీఎంకే (ఆలిండియా ద్రావిడ మున్నేత్ర కళగం) పార్టీలు మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్య సంస్కృతి మరియు హిందీ భాష పట్ల బేషజాలను పెంచుకున్న ఈ ద్రావిడ దళాలు తమిళనాడులో మాత్రం అవినీతిని బాగా పెంచి పోషించాయనే ఒక వాదన ఉంది. డీఎంకే నేత  కరుణానిధితో పాటు అన్నాడీఎంకే నేతలు ఎంజీ రామచంద్రన్‌, జయలలితలు కూడా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చినవారే. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాక,  తమిళనాడులో ద్రావిడవాదానికి బదులుగా అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పే ఎజెండాతో సరికొత్త రాజకీయాలు వస్తున్నాయని అంటున్నారు
. ఈ సంకేతాలు దేశ రాజకీయాలకు కూడా అందుతాయనడంలో సందేహం లేదు. 

రజనీకాంత్‌కి 'ఛత్రపతి శివాజీ' ప్రేరణా..?
రజనీకాంత్ కర్ణాటకలో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేసినా.. ఆయన మూలాలు మహారాష్ట్రలో ఉన్నాయని.. ఆయన పూర్వీకులు సాక్షాత్తు మరాఠా యోధుడు శివాజీ సైన్యంలో పనిచేశారని అంటుంటారు. అలాగే రజనీకాంత్ అసలు పేరు 'శివాజీరావు గైక్వాడ్'. సంఘ పరివార్‌లో శివాజీని ఎంత గొప్ప హిందూ నాయకుడిగా అభిమానిస్తారో, ఆరాధిస్తారో మనకు తెలియంది కాదు. శివాజీ ఆకాంక్షలకు గుర్తుగా కాషాయ జెండాను కూడా ఎగరవేస్తుంటారు.

అలాగే శివాజీ తల్లి పేరు, రజినీకాంత్ తల్లిపేరు కూడా ఒకటే కావడం గమనార్హం. ఇద్దరూ 'జిజియాబాయి' పేరే పెట్టుకోవడం విశేషం. 10 సంవత్సరాల క్రితం రజనీకాంత్ కూడా 'శివాజీ' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో కథానాయకుడు అవినీతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకుంటాడు. రజనీకాంత్ స్వయంగా తన మాటల్లో  భగవద్గీత శ్లోకాలను ఉటంఘిస్తూ, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి భక్తి ప్రవృత్తులు కలిగుండాలో ఆ సినిమాలో తన సంభాషణల ద్వారా చెబుతారు. అయితే తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఇలాంటి జాతీయవాద ఆలోచనలున్న రజనీకాంత్ ఎలా రాజకీయాల్లో రాణించగలరనేది ఒక ప్రశ్నే..?

దళిత రాజకీయాలే రజనీకాంత్ ఎజెండా...?
తమిళనాడులో దళిత, పీడితవర్గాలకు న్యాయం ఎంత వరకు జరిగిందన్న విషయం పక్కన పెడితే.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బ్రాహ్మణ కుటుంబం నుండి రావడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో గతకాలం నుండి దళిత వర్గాల నుండి గట్టిపోరాటమే జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలపై కూడా వ్యతిరేకత కొన్నిసార్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిత్రమేంటంటే.. అవినీతి పెరుగుతున్నప్పుడు వాటి ప్రభావం పీడిత వర్గాలపై ఎప్పుడూ ఉంటుందనేది కాదనలేని విషయం. గుజరాత్ ఎన్నికల్లో కూడా దళిత ప్రతినిధిగా బరిలో దిగిన జిగ్నేష్ మెవానీ బీజేపీని ఎలా కంగుతినిపించాడో తెలిసిన విషయమే. ఒకవేళ రజనీకాంత్ కూడా అవినీతిని ఎదుర్కొనే రాజకీయాలకు శ్రీకారం చుడుతున్న క్రమంలో.. దళితుల సమస్యలపై కూడా తన ఎజెండా ఏంటో ప్రకటిస్తే.. దళిత కార్డును వాడుకుంటే  దేశ రాజకీయాల్లో పెద్ద దుమారం వచ్చినట్లే.

రాజకీయాల్లో 'సినీ' గ్లామర్ పనిచేస్తుందా..?
భారత ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్ పొందిన రజనీకాంత్‌కు తమిళనాడులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే భారతదేశంలో అంతే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మరో వ్యక్తి సచిన్ టెండుల్కర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికే కుటిల రాజకీయాల వల్ల.. రాజ్యసభలో మాట్లాడే అవకాశం దక్కలేదు. హేమమాలిని, జయా బచ్చన్, శతృఘ్న సిన్హా, కిరణ్ ఖేర్, స్మృతి ఇరానీ లాంటి వారు మాత్రమే రాజకీయాల్లో కొంతవరకు విజయం సాధించగలిగారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, గోవిందా లాంటి వారు రాజకీయాల్లో ఇమడలేక మళ్లీ సినిమాల్లో నటించడానికి వెళ్లిపోయారు.

2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నటుడు చిరంజీవి పార్టీ పెట్టినా.. ఆ తర్వాత దాన్ని అతను కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఇటీవలే కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌తో సయోధ్య పెంచుకోవడం చూస్తుంటే ఆయన రాజకీయ పరిణితిపై కూడా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా బీజేపీ నేత జీవిఎల్ నరసింహారావు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని స్వాగతించారు. ఏదేమైనా.. జయలలిత మరణించిన తర్వాత రజనీకాంత్ తమిళనాడు రాజకీయాల్లో కొత్త హీరోగా అవతరించిన తరుణంలో.. ఆ రాజకీయ వేడిని ఎలా తట్టుకుంటాడన్నది మాత్రం వేచి చూడాల్సిందే..!

రీల్ లైఫ్ హీరోలు.. రియల్ లైఫ్ హీరోలు కాగలరా..?
రజనీకాంత్ 2021 ఎన్నికల్లో 234 సీట్లలోనూ తన అభ్యర్థులను బరిలోకి దింపుతానని ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులువు కాదని, ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలోనే రాజీనామా చేస్తాను అని ఆయన ప్రకటించడం గమనార్హం. రజనీకాంత్ లాంటి హీరోకి కూడా పార్టీ పెట్టకముందు, ముఖ్యమంత్రి అనే పదం వాడడం అవసరమే అని అనిపించడం ఆశ్చర్యమే. అన్నాహజారే లాంటి సామాజికవేత్త ప్రేరణలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ పెట్టి అవినీతిని అంతమొందిస్తానని చెప్పి, ఢిల్లీలో 95 సీట్లు గెలిచి సీఎం అయ్యాడు. ఆయన సైతం మూడేళ్లలో రాష్ట్రంలో అవినీతిని అంతమొందించలేకపోయాడు. మరి రజనీకాంత్ మాటలు ఎంతవరకు ప్రాక్టికల్ అనే విషయం కూడా ఆలోచించాలనేది కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయం. 

ఒకవేళ రజనీకాంత్ మాటలు నమ్మి ఆయనను ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే.. ఆ రీల్ లైఫ్ హీరో.. రియల్ లైఫ్‌లో అవినీతిని ఎలా నిర్మూలిస్తాడో వేచి చూడాల్సిందే. ఈ ఒక్క విషయమే దేశ రాజకీయాల్లో పెద్ద పెద్ద బడా నాయకులకు నిద్రపట్టకుండా చేస్తుందా లేదా.. అన్నది కూడా భవిష్యత్తే చెప్పాలి...!

Trending News