ఇకపై రైలు టికెట్టును మరొకరికి బదిలీ చేయవచ్చు..!

ఏవైనా కారణాల వల్ల జర్నీ రద్దు చేసుకోవలసి వస్తే ప్రయాణికులు రిజర్వు చేసుకున్న టికెట్‌ను ఇతరులకు బదిలీ చేయవచ్చు.

Last Updated : Mar 10, 2018, 02:32 PM IST
ఇకపై రైలు టికెట్టును మరొకరికి బదిలీ చేయవచ్చు..!

దూర ప్రయాణం కోసం రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకొని, సరిగ్గా అదే సమయానికి ఏదో పనిపడి ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే, ఆ టికెట్ వృథా అయినట్టే. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. అవునా..! ఇప్పుడు ఇలాంటి సమస్యలకు భారతీయ రైల్వే ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చింది. ఏవైనా కారణాల వల్ల జర్నీ రద్దు చేసుకోవలసి వస్తే ప్రయాణికులు రిజర్వు చేసుకున్న టికెట్‌ను ఇతరులకు బదిలీ చేయవచ్చు.

* ఒకవేళ టికెట్‌ రిజర్వు చేసుకున్న ప్రయాణికులు గవర్నమెంట్ ఉద్యోగులైతే రైలు బయల్దేరడానికి నిర్దేశించిన 24 గంటల్లోపు తమ టికెట్‌ను వేరే ప్రయాణికుడి పేరు మీదకు మార్చమన్నట్లు లిఖితపూర్వకంగా లేఖరాసి ఇవ్వాల్సి ఉంటుంది.

* సాధారణ ప్రయాణికులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. కాకపోతే ప్రయాణికుడి కుటుంబ సభ్యులకు అంటే అమ్మానాన్నలకు, భార్య, సోదరులు, సోదరీమణులు, భర్త, కొడుకు, కుమార్తెలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. రైలు బయల్దేరడానికి నిర్దేశించిన 24 గంటలలోపు ప్రయాణికులు ఈమేరకు లిఖితపూర్వకంగా లేఖరాసి ఇవ్వాల్సి ఉంటుంది

* ఒక వేళ ప్రయాణికులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ అయితే.. వారు టికెట్‌ను బదిలీ చేసుకోదలిస్తే సంబంధిత విద్యాసంస్థల అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. రైలు బయల్దేరడానికి నిర్దేశించిన 48 గంటల్లోపు ఈ మేరకు సంతకంతో కూడిన అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది.

* ఎన్‌సీసీ బృందానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. కాకపోతే వీరి బృందంలోని నాయకుడి సంతకం కావాల్సి ఉంటుంది. అయితే మొత్తం బృందంలో 10 శాతం సభ్యులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అంతకు మించిన అభ్యర్థనలను తిరస్కరిస్తారు. ఉదాహరణకు మొత్తం బృందంలో 20మంది ఉంటే వారిలో ఇద్దరికి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది.

Trending News