ఆ సామాన్యుడు.. ఓ దేశాన్ని కనిపెట్టాడు..!

  

Last Updated : Nov 14, 2017, 06:12 PM IST
ఆ సామాన్యుడు.. ఓ దేశాన్ని కనిపెట్టాడు..!

ఆ నిర్మానుష్యమైన ప్రాంతం ఈజిప్టు, సుడాన్ దేశాలకు మధ్యలో ఉంది.. కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి.. అన్నట్లు ఆ ప్రాంతంలో కనీసం ఒక జంతువైనా, పక్షైనా కనిపిస్తే ఒట్టు. తన టూర్‌లో భాగంగా ఆ ప్రాంతంలో సంచరించాలని భావించాడు సుయాస్ దీక్షిత్ అనే ఓ ప్రవాస భారతీయ కుర్రాడు. అనుకున్నదే తడవుగా అనేక అడ్డంకులు ఎదుర్కొని వెళ్లాడు. చూట్టూ చూశాడు.. ఇటు వైపు ఈజిప్టు వెళ్లాలంటే  ఓ వంద మైళ్ళు ప్రయాణించాలి.. అటు వైపు సుడాన్ వెళ్లాలంటే మరో వంద మైళ్లు ప్రయాణించాలి. బోర్డర్ మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఆ ప్రాంతం ఈ రెండు దేశాలకు చెందన్న మాట. ఆ విషయం తెలియగానే సుయాస్‌కి ఓ వింత ఆలోచన వచ్చింది. అనుకున్నది తడవుగా తానే ఆ దేశానికి రాజుగా ప్రకటించుకున్నాడు. "ప్రపంచ దేశాల సరసన ఎవరికీ తెలియని మరో దేశం. దీనిని నేనే కనిపెట్టాను. దీనికి రారాజును నేనే" అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఫోటోలు కూడా షేర్ చేశాడు. 

ఆ పోస్టు పెట్టాక, ఆ ప్రాంతానికి తాను ఒక దేశాధికారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, తన తండ్రి సుయోగ్ దీక్షిత్‌ను ఆ దేశానికి ప్రధాన మంత్రిని చేస్తున్నానని ప్రకటించాడు. ఆయన జన్మదినానికి అదే తానివ్వబోయే బహుమతి అని తెలిపాడు. ప్రస్తుతం ఆ దేశ జనాభా ఒక వ్యక్తి మాత్రమే అని... అది కూడా తానేనని తెలిపాడు. తన జాతీయ జంతువుగా బల్లిని ప్రకటించాడు. తన దేశ రాజధానికి సుయాస్ పూర్ అనే పేరు పెట్టాడు. దేశం పేరు "కింగ్ డమ్ ఆఫ్ దీక్షిత్" అని పెట్టాడు. ఆ రాజ్యానికి జెండా కూడా తయారుచేశాడు. అయితే ఎంతో సాహసం చేస్తే గానీ, ఆ రహస్య ప్రాంతానికి అతను చేరుకోలేదట.  నిర్మానుష్య ప్రాంతాలను సంచరించడం హాబీగా గల సుయాస్‌కు.  ఈజిప్టు సైనికుల నుండి తొలుత తనకు అడ్డంకులు ఎదురైనా,  ఆ తర్వాత ఎలాగోలా ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని ఓ డ్రైవర్ సహాయంతో అక్కడికి చేరుకున్నాడు సుయాస్. అయితే ఒక ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదని.. అక్కడ వ్యవసాయం చేస్తేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు ఈ కొత్త దేశాధిపతి. తన తదుపరి పథకం అదేనని.. ఎవరికీ చెందని ఆ రాజ్యంలో తానే దేశాధినేతగా వ్యవసాయం చేస్తానని అంటున్నాడు. 

Trending News