పిల్లలను బాగా చదివించాలంటే.. ముందు వారికి చదువు పట్ల ఉన్న భయం పోగొట్టాలి.. చదువు పట్ల ఇష్టాన్ని పెంచాలి. వారి మనసులో ఉన్న సందేహాలను, ఆందోళనలను నివృత్తి చేయాలి. వారి బంగారు భవిష్యత్తుకు బాట చూపించడం తల్లితండ్రుల బాధ్యత. పిల్లలు బాగా చదువుకుంటే.. తల్లితండ్రులకేగా పేరు. అందుకే పిల్లలు ఇష్టపడి చదవాలంటే ఇలా చేయండి...
* పిల్లలకు ఏదైనా సబ్జెక్టులో ఆసక్తి లేకపోతే.. కారణాన్ని అడిగి తెలుసుకోండి. పాఠం అర్థం కాలేదా? లేక వినలేదా? అనే విషయాన్ని గ్రహించి పొరపాటును సరిదిద్దండి.
* పిల్లలతో ఫ్రీగా ఉండండి. ప్రశ్నకు ఓపికగా సమాధానమివ్వండి. ఇలా చొరవ చూపిస్తే.. చదువుకు సంబంధించిన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది.
* ఇతర విద్యార్థులతో పిల్లలను పోల్చవద్దు. వారిని మానసిక వ్యధకు గురిచేయవద్దు. "నువ్వూ బాగా చావుకుంటే మంచి మార్కులు వస్తాయ్.. నీ భవిష్యత్తు బాగుంటుంది" అని పాజిటివ్‌గా స్పందించండి. ఇలా చెప్పడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. (చూస్తున్నారుగా.. పాఠశాలల్లో ఒత్తిళ్లు భరించలేక ముక్కుపచ్చలారని పసికందులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో..! )
* పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే "అమ్మా..! నేను బయటికి వెళ్లి ఆడుకుంటాను. ఈ ఒక్కరోజూ చదువుకోను" అంటే వదిలేయండి. కానీ ఇదే వారికి అలవాటు కాకుండా చూసుకోండి.
* పరీక్షల్లో పిల్లలు మంచి మార్కులు తీసుకొస్తే.. వారికి పనికొచ్చే వస్తువును బహుమతిగా ఇవ్వండి. దీంతో వారు మరింత బాగా చదవటానికి ఉత్సాహం చూపుతారు.