KCR About New Secretariat: అందుకే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామన్న కేసీఆర్

KCR About Telangana New Secretariat Building: అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత దేశాన విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయం గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.  

Written by - Pavan | Last Updated : Apr 29, 2023, 08:07 PM IST
KCR About New Secretariat: అందుకే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామన్న కేసీఆర్

KCR About Telangana New Secretariat Building: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపచేసేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో  అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సిఎం అన్నారు. ‘‘డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం’’ ప్రారంభోత్సవ శుభ సందర్భంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక అపోహలు సృష్టించి చేసిన విమర్శలు అడ్డంకులను దాటుకుంటూ ధృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతి కాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
   
భవిష్యత్తు తరాల పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత గొప్పవైన సాంకేతిక విలువలతో కూడిన నిర్మాణ కౌశలంతో సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు. అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తూ, అనేక విశిష్టతలను సొంతం చేసుకుంటూ, దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని సిఎం తెలిపారు. ప్రశాంతతను ప్రసాదించే దేవాలయం మాదిరి, చూస్తేనే కడుపు నిండే విధంగా.. అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా నిర్మితమైన సచివాలయం, ప్రభుత్వయంత్రాంగ పనితీరును గొప్పగా ప్రభావితం చేస్తూ గుణాత్మక మార్పుకు బాటలు వేయనున్నదన్నారు. 

మార్పుకనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ, ప్రజా ఆకాంక్షలకు అనుకూలంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని సిఎం అన్నారు. ఒక రాష్ట్ర సచివాలయానికి డా. బిఆర్. అంబేద్కర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారి అని సిఎం తెలిపారు. అంబేద్కర్ మహాశయుని పేరు  పెట్టుకోవడం వెనక సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళా, పేద వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యం ఉందని సీఎం తెలిపారు. 

ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక జ్యోతి, పక్కనే ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ మహాశయుడు రేపటికి దిక్సూచిగా నిలిచి నిరంతరం ఒక స్పూర్తిని రగిలిస్తుండగా, తెలంగాణ పాలన సౌధం నుంచి జాతి మెచ్చే సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందాలనే మహోన్నత లక్ష్యంతో, తాత్వికత సైద్దాంతిక అవగాహనతోనే అంబేద్కర్ మహాశయుని పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టడం జరిగిందని సిఎం అన్నారు. 
దేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే, తెలంగాణ సకల జనుల సంక్షేమ పాలనను దేశానికి ఆదర్శంగా అందిస్తున్నదని సిఎం అన్నారు.

అనతికాలంలోనే దేశానికే తెలంగాణ పాలన ఒక మోడల్ గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా విస్తరించేలా తెలంగాణ పాలన నూతన సచివాలయం నుంచి ద్విగుణీకృతమౌతుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభ దేదీప్యమానమయ్యేలా, దార్శనికతతో సాధించిన ప్రగతి వెలుగుల దారిలో, ప్రస్థానం మహోన్నతంగా కొనసాగుతుందని సిఎం కేసీఆర్ తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో అమోఘమైన పాత్ర పోషించిన, రాల్లెత్తిన కూలీలను, మేస్త్రీలను, నిర్మాణంలో కష్టించి పనిచేసిన అన్ని వృత్తుల నిపుణులను, అపురూపంగా మోడల్ అందించిన ఆర్కిటెక్టులను, విరామం ఎరుగక రేయింబవళ్లు పనిచేసిన కాంట్రాక్టు ఏజెన్సీలను, వారి ఇంజనీర్లను, ఆర్ అండ్ బి శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను, ఇంజనీర్లను, సిబ్బందిని, నిర్మాణంలో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా సిఎం కేసీఆర్ అభినందించారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x