భారీ వర్షాల వల్ల కేరళ అతలాకుతలమవుతోంది. కొండ చరియలు జనావాసాల మీద విరిగిపడడంతో పాటు.. అలాగే విపరీతమైన వరద ప్రభావంతో ఈ బీభత్సం కారణంగా రెండు లక్షలమందికి పైగా నిరాశ్రయులయ్యారు. అలాగే వేలాది హెక్టార్లలో పంట దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం అధికారులు డ్యామ్‌ల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తూ.. ఈ వారాంతం వరకు వానలు కురుస్తాయని తెలపడం గమనార్హం. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అందరూ కేరళ పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు.
కడపటి వార్తలు అందేసరికి... ఈ వర్షాలు, వరదలు కారణంగా 324 మంది మరణించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. కాగా.. కేరళ ప్రజలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేస్తామని హోంశాఖ తెలిపింది. ఇప్పటికే కోస్ట్‌గార్డు, ఎన్డీఆర్ఎఫ్ రక్షణ బృందాలను కేరళ పంపించినట్లు శాఖ తెలియజేసింది.
ప్రస్తుతం ఈ ప్రకృతి బీభత్సం వల్ల తాగునీటికి కూడా నోచుకోలేక క్యాంపుల్లో మగ్గుతున్న ప్రజానీకానికి... నీటిని సరఫరా చేసేందుకు ఐఎన్ఎస్ దీపక్ ట్యాంకర్ 8 లక్షల లీటర్ల మంచినీటితో ముంబయి నుండి కేరళ బయలుదేరింది. 19వ తేదిన ఆ ట్యాంకు కోచి చేరుకుంటుందని నేవీ అధికారులు అంటున్నారు. అదేవిధంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాలలో శనివారం పర్యటనకు రానున్నారు. కేరళ వరద బాధితులకు విరాళం అందించాలని మీరు కూడా భావిస్తే.. https://donation.cmdrf.kerala.gov.in/ లింక్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు.
Kerala is facing its worst flood in 100 years. 80 dams opened, 324 lives lost and 223139 people are in about 1500+ relief camps. Your help can rebuild the lives of the affected. Donate to https://t.co/FjYFEdOsyl #StandWithKerala.
— CMO Kerala (@CMOKerala) August 17, 2018