కెనడాలో మళ్లీ జాత్యహంకార దాడులు పురుడుపోసుకుంటున్నాయా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల కెనడాలో ఓ భారతీయ దంపతులపై స్థానికుడు వేధింపులకు పాల్పడటమే కాకుండా వారిని భారత్‌కి తిరిగి వెళ్లిపోవాల్సిందిగా బెదిరించిన సంగతి తెలిసిందే. అంతటితో సరిపెట్టుకోని ఆ దురహంకారి.. ఆ దంపతుల పిల్లలను సైతం హతమారుస్తానని బెదిరింపులకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఆ దుర్ఘటన ఇంకా మరువకముందే తాజాగా కెనడాలోనే మరో స్థానిక మహిళ ఓ భారతీయుడి పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి, అతడిపై ఇష్టంవచ్చినట్టు నోరు పారేసుకున్న వైనం షాక్‌కి గురిచేస్తోంది.
సీటీవీ న్యూస్ వార్తా కథనం ప్రకారం ఏడేళ్లుగా కెనడాలో ఉంటున్న భారతీయుడైన రాహుల్ కుమార్ గత వారం తన ఇంటి ఎదురుగా ఉన్న కారు పార్కింగ్ స్థలంలోనే స్థానిక మహిళ చేతిలో వేధింపులకు గురయ్యారు. పార్కింగ్ విషయంలో రాహుల్ కుమార్ తో గొడవ పెట్టుకున్న ఆ శ్వేత జాతీయురాలు.. నువ్వు పాకీవి(పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి). నువ్వు నీ దేశానికి వెళ్లిపో అంటూ ఓసారి, ఈస్ట్ ఇండియా పాకివి అంటూ మరోసారి కేకలు వేసింది. అయితే, ఆ మహిళ దురుసు ప్రవర్తన చూసి ఏం చేయాలో అర్థం కాని రాహుల్ ఆమె జాత్యహంకార వైఖరిని కెమెరాలో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ మహిళ.. వీడియో చిత్రీకరించుకుంటే తనకేమైనా భయమా ? నీకు తోచింది చేస్కో అంటూ అరిచింది. అంతటితో సరిపెట్టుకోకుండా రాహల్ కుమార్ చర్మం అషిద్ధం వర్ణాన్ని పోలి ఉందని ఎగతాళి చేసింది. చివరకు రాహుల్ కుమార్ కారుపై ఉమ్మేసి అక్కడి నుంచి తన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయిందా మహిళ.
ఈ వీడియోను చూపిస్తూ వార్తను ప్రసారం చేసిన సీటీవీకి ఫోన్ చేసిన మహిళ అప్పటికీ తన తప్పిదాన్ని ఒప్పుకోలేదు. జరిగిన దానిపై తనకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని చెబుతూ ఆ వార్తను ప్రసారం చేసిన సీటీవీ తీరునే తప్పుపట్టిందామె. జరిగిన ఘటనను తప్పని ఒప్పని అంగీకరించాల్సిన అవసరం తనకేమీ లేదని తెగేసి చెప్పిందా మహిళ.