ప్రముఖ కెనడియన్ సింగర్ బ్రయాన్ ఆడమ్స్కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ‘యంగ్ రెబల్‌స్టార్’ ప్రభాస్ ఆతిథ్యం ఇవ్వనున్నారట. బ్రయాన్ వచ్చే నెలలో ఐదు రోజులు ఇండియాలో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ (అక్టోబర్ 9 ), హైదరాబాద్(అక్టోబర్ 11), ముంబై (అక్టోబర్ 12), బెంగళూరు(అక్టోబర్ 13), న్యూఢిల్లీ (అక్టోబర్ 14) నగరాలకు రానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్ కు వస్తున్న బ్రయాన్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పడానికి బాలీవుడ్లో అమితాబ్, హైదరాబాద్ ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ వేడుకలకు కేవలం కొంతమంది సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.
'వెల్కమ్ పార్టీపై బ్రయాన్ అంతగా ఆసక్తి చూపలేదు. కానీ చాలా ఏళ్ల తర్వాత (2011లో బ్రయాన్ ఇండియాకు వచ్చారు) భారత్‌కు వస్తుండటంతో ఇక్కడి పలు ప్రదేశాల్ని చూడాలని అనుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో బ్రయాన్ పలువురు సెలబ్రిటీలను కలుస్తారు’ అని ఆయన బృందం చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బిగ్ బి ఇచ్చే పార్టీలో జాయిన్ అయ్యేందుకు రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, ఫర్హాన్ అక్తర్ తదితరులు ఆసక్తిగా ఉన్నారట. ఇందులో ‘నమస్తే ఇంగ్లండ్’ సినిమాను ప్రమోట్ చేయాలని అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా, ఏఆర్ రెహ్మాన్ ఆయనతో కలిసి స్టేజ్ పంచుకోనున్నారని తెలిసింది.