సారిడాన్‌తో పాటు మరో రెండు డ్రగ్‌లపై నిషేధం ఎత్తివేసిన సుప్రీంకోర్టు

సారిడాన్‌‌పై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు

Last Updated : Sep 17, 2018, 02:22 PM IST
సారిడాన్‌తో పాటు మరో రెండు డ్రగ్‌లపై నిషేధం ఎత్తివేసిన సుప్రీంకోర్టు

ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని డ్రగ్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం సుప్రీంకోర్టు ఆ జాబితాలో ఉన్నసారిడాన్‌తో సహా మరో రెండు మాత్రలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఔషధ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ.. అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఇక సారిడాన్‌‌ మార్కెట్లో లభించనుంది. అంతేకాదు.. 1988కు ముందు తయారు చేయబడిన FDCలను నిషేధించాలనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క ఆర్డర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కేంద్రాన్ని కోర్టు కోరింది.

సెప్టెంబర్ 12న మొత్తం 328 కాంబినేషన్ డ్రగ్స్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది. అందులో సారిడాన్ పెయిన్ కిల్లర్ కూడా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించిన వాటిలో సారిడాన్ సహా పాన్‌డెర్మ్ స్కిన్ క్రీం, గ్లుకోనార్మ్ పీజీ అనే కాంబినేషన్ డయాబెటిస్ డ్రగ్, యాంటీ బయోటిక్ లుపీడీక్లాక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ట్యాక్సిమ్ ఏజెడ్ లాంటి ఔషధాలు ఉన్నాయి. ఈ సత్వర ఉపశమన మాత్రలతో దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయని పేర్కొంది.

సురక్షితం కాని ఈ ఔషధాలపై నిషేధం విధించడం కోసం ఆరోగ్య శాఖ 2016 నుంచి కసరత్తు చేస్తోంది. 2016లో మార్చి10న 344 డ్రగ్‌లను ప్రభుత్వం నిషేధించగా.. వీటి తయారీ సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. దీంతో ఈ అంశాన్ని పరిశీలించాలని 2017 డిసెంబర్ 15న డ్రగ్ సాంకేతిక సలహా బోర్డు(డీటీఏబీ)కు సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై స్పందించిన డీటీఏబీ.. ఈ 328 ఔషధాల్లో వాడిన పదార్థాలు హానికరమని.. డ్రగ్‌ల నిషేధంలో తప్పులేదని స్పష్టం చేసింది.

కాగా.. సారిడాన్ మాత్ర తలనొప్పికి వాడే చాలా ఫేమస్ డ్రగ్. శారిడాన్ మాత్రను బ్యాన్ చేయడాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

Trending News