విజయవాడ సెంట్రల్ టికెట్ పై ఆశపెట్టుకున్న వంగవీటికి నిరాశే ఎదురైంది. ఆ స్థానాన్ని రాధాకు కేటాయించలేమేని వైసీపీ అధిష్టానం తేల్చిచెప్పింది. ఈ మేరకు వైసీపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి అంబటిరాంబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గెలుపు, ఓటముల లెక్క ప్రకారమే సీట్ల కేటాయింపులు ఉంటాయన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో ప్రతిఒక్కరూ పార్టీ ఆదేశాలను పాటించాల్సిందేనని పేర్కొన్నారు. అయితే వంగవీటి కుటుంబాన్ని వైసీపీ దూరం చేసుకోదని...రాధాకు విజయవాడ తూర్పు అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటును కేటాయిస్తామని తెలిపారు.
వైసీపీ తాజా నిర్ణయంతో వంగవీటి వర్గీయుల ఆగ్రహావేశాలు మరింత పెరిగాయి. వైసీపీతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వారు వచ్చారు. దీనిపై వంగవీటి రాధా ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇచ్చిన సీటు తీసుకొని సర్దుకు పోతారా..లేదంటే అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి తన దారి తాను చూసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.