గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి కన్నుమూత

గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి కన్నుమూత

Last Updated : Oct 3, 2018, 08:50 AM IST
గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి కన్నుమూత

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యావేత్త, గీతం విశ్వవిద్యాలయం అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి కన్నుమూశారు. కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈయన ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంవీవీఎస్‌ మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియా జరగనున్న గీతం పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

కాగా ప్రమాద సమాచారం తెలుసుకున్న తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎంవీవీఎస్‌ మూర్తి సహా ప్రమాదంలో మరణించిన వారి పార్థివదేహాలను భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గోల్డ్‌స్పాట్‌ మూర్తిగా అందరికీ సుపరిచితమైన ఎంవీవీఎస్‌ మూర్తి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా మూలపాలెం గ్రామం. కాకినాడలో ఉన్నత విద్యను మూర్తి అభ్యసించారు. ఆంధ్ర వర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. హైకోర్టులో న్యాయవాదిగా కూడా పని చేశారు.

చంద్రబాబు సంతాపం

ప్రముఖ విద్యావేత్త, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానని తెలిపారు. మూర్తి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఏపీ మంత్రులు ఎంవీవీఎస్‌ మూర్తి హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

Trending News