ఉత్తర భారతదేశంలో కలకలం రేపుతున్న 'జికా' వైరస్

ఉత్తర భారతదేశంలో కలకలం రేపుతున్న జికా వైరస్

Last Updated : Oct 9, 2018, 02:29 PM IST
ఉత్తర భారతదేశంలో కలకలం రేపుతున్న 'జికా' వైరస్

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జికా వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. తొలుత ఏడు మంది జికా వైరస్ బారిన పడినట్లు గుర్తించిన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాజస్థాన్‌లో మొత్తం 29 జికా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వేణు గుప్తా తెలిపారు. వైద్య బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నట్లు చెప్పిన ఆమె.. అవసరమైన చోట శ్యాంపిళ్లను సేకరిస్తున్నట్లు చెప్పారు.

 

ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) అప్రమత్తమై ఒక నివేదికను కోరిందని రిపోర్టులు వెల్లడించాయి. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌‌సీసీడీ)లో ఒక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయడంతో పాటు ఒక ఉన్నతస్థాయి కమిటీ జైపూర్‌కు వెళ్లిందని నివేదికలు తెలిపాయి.

జికా వైరస్ వ్యాప్తి పట్ల కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. డాక్టర్లు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు.. పరిస్థితిని కేంద్ర బృందాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్న ఆయన.. ఎవరూ భయపడవొద్దన్నారు.

గత నెలలో ఓ వ్యక్తి జికా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. దీంతో రాజస్థాన్‌‌లో తొలికేసు నమోదైంది. ఎన్‌సీడీసీ పరిస్థితిని సమీక్షిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

జికా వైరస్ సోకిన వారిని జైపూర్‌లోని హాస్పటల్‌లో చేర్పించారు. రాజస్థాన్ ఆరోగ్యశాఖ వారిపై నిఘా పెట్టింది. అక్కడ మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.

అటు బీహార్ ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. జైపూర్‌లో జికా సోకిన‌ వ్యక్తుల్లో బీహారీ కూడా ఉన్నాడు. అతను ఈ మధ్యే సొంత రాష్ట్రానికి వచ్చి వెళ్లాడు. దీంతో నితీశ్ ప్రభుత్వం బీహార్‌లోని అన్ని జిల్లాలను అలర్ట్ చేసింది. ఢిల్లీ కూడా అలర్ట్ అయ్యింది.

జికా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 86 దేశాలు జికా వైరస్ వ్యాధికి గురవుతున్నాయి. జికా వైరస్ వ్యాధి లక్షణాలు డెంగ్యూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్‌ని పోలి ఉంటాయి. జ్వరం, చర్మం దద్దుర్లు, కండ్లకలక, కండరాలు కీళ్ళ నొప్పి, విపరీతమైన తలనొప్పి వంటివి లక్షణాలు కలిగి ఉంటుంది.

భారతదేశంలో తొలిసారి అహ్మదాబాద్‌లో జనవరి- ఫిబ్రవరి 2017లో, రెండవసారి 2017 జులైలో తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో జికా వైరస్ వెలుగు చూసింది.

 

Trending News