YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ వచ్చేసింది. మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. ఇక జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి అన్నకు వ్యతిరేకంగా బరిలో దిగుతోంది. కడప గడ్డ నుంచి షర్మిల పోటీకి సిద్ధమౌతుందని తెలుస్తోంది.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ పగ్గాలు చేతపట్టి బరిలో దిగిన వైఎస్ షర్మిల అన్న జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఎన్నికల బరిలో కూడా దిగనుందని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ కంటే లోక్‌సభకు పోటీ చేసేందుకే ఆమె ఆసక్తి చూపిస్తోంది. తొలుత వైఎస్ షర్మిల విశాఖపట్నం పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమెను కడప లోక్‌సభ నుంచి బరిలో దించాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టాలంటే కడప నుంచి పోటీ చేయడమే సరైందని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా కడప నుంచి వైసీపీ అభ్యర్ధి వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ షర్మిల బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది.
ఏపీ 25 మంది పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈనెల 25వ తేదీన విడుదల చేయవచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేయాలంటే వైఎస్ షర్మిల బరిలో ఉంటేనే సాధ్యమౌతుందని కాంగ్రెస్ అంచనా.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ 128 మందిని ప్రకటించేసింది. జనసేన సైతం 15మందిని ఫైనల్ చేసింది. ఇక బీజేపీ, జనసేన మిగిలిన స్థానాల్ని ప్రకటించనున్నాయి. వామపక్షాలతో కూటమిగా బరిలో దిగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Also read: Electoral Bonds: ఎన్నికల బాండ్లపై ఏదీ దాచవద్దు, ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook