అమెరికాలో మరోమారు ఓ దారుణమైన ఘటన జరిగింది. కాలిఫోర్నియాలోని ఓ దేశీయ బార్లో ఏర్పాటైన కాలేజీ విద్యార్థుల పార్టీకి ఓ ఆగంతకుడు హాజరయ్యాడు. వచ్చీ రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. అక్కడున్న వారిపై తూటాల వర్షం కురపించాడు. వందలాది మంది హాజరైన పార్టీలో రక్తం ఏరులై పారింది. తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. కొందరు బార్ అద్దాలు పగలకొట్టి.. బయటకు పారిపోయారు. కొందరు బాత్ రూమ్స్‌లో తలదాచుకున్నారు. వెంటనే బార్ యాజమాన్యం పోలీస్ హెల్ప్ లైనుకి సమాచారం అందించింది. కానీ పోలీసులు వచ్చేటప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.
దాదాపు 12 మంది ఆ దాడిలో చనిపోగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. హంతకుడిని నిలువరించడం కోసం తొలుత హోటల్లోకి అడుగుపెట్టిన పోలీసు అధికారి సార్జంట్ రాన్ హెలస్కూ కూడా దాడిలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పథకం ప్రకారం బార్‌ను మొత్తం కంట్రోల్లోకి తీసుకొనేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ క్రమంలో అదనపు బలగాలను రప్పించి.. గుంపుగా పోలీసులు లోపలికి వెళ్లారు. ప్రాణాలకు తెగించి.. నేరస్తుడిని నిలువరించారు. కానీ హంతకుడిని అరెస్టు చేయలేకపోయారు. పోలీసులను చూడగానే హంతకుడు తనను తానే కాల్చుకొని మరణించాడు.
ఈ హత్యలకు పాల్పడిన హంతకుడు గతంలో అమెరికాలోనే మెరైన్ డిపార్టుమెంటులో పనిచేసేవాడని.. గత కొంతకాలంగా ఆయన మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఈ దాడిలో హంతకుడిని పట్టుకొనేందుకు బార్లో అడుగుపెట్టిన మొదటి పొలీస్ అధికారి రాన్ కూడా ఆసుపత్రిలో మరణించారు. అమెరికాలో ఆగంతకులు విచక్షణారహితంగా పబ్లిక్ ప్రాంతాల్లో కాల్పులు జరపడం ఇది ప్రథమం ఏమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ సంవత్సరమే ఫ్లోరిడాలో ఓ ఆగంతకుడు చేసిన కాల్పుల్లో 17 మంది పురజనులు స్పాట్లో మరణించారు. క్రితం సంవత్సరం లాస్ వెగాస్‌లో 58 మంది మరణించారు.