రేవంత్ రెడ్డి, కేటీఆర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓటుకి నోటు కేసులో దొరికిపోయి.. ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతుంది రేవంతేనా? అన్న తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాటలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం’ అనే శీర్షికతో ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. ఆ పోస్టులో సత్యం రామలింగరాజు తనయుడు తేజారాజుతో కేటీఆర్ కలిసున్న ఫోటోని పోస్టు చేశారు. కేటీఆర్ మంత్రి అయ్యాక, మలేషియాను 2016లో అధికారికంగా పర్యటించారు. అప్పుడు మలేషియా ప్రధానిని కలవడానికి కేటీఆర్, తేజారాజుతో కలిసి వెళ్లినట్లు చూపిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ‘2016లో జరిగిన అధికారిక పర్యటనలో అనధికారికంగా తేజా రాజుతో మలేసియా ప్రధాన మంత్రిని కలిసిన కేటీఆర్కు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్’ అని ఫోటోకి కామెంట్ కూడా పెట్టారు రేవంత్ రెడ్డి. వేలకోట్ల కుంభకోణానికి కారణమైన సత్యం రామలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్ మలేషియాలో వెలగబెట్టిన నిర్వాకమేమిటో చెప్పాలని, స్కాం స్టార్లలతో తిరగుతూ దొరకని దొంగగా చెలామణీ అవుతున్న వారిని తెలంగాణ సమాజం త్వరలోనే గుర్తిస్తుందని రేవంత్ ఆ పోస్టులో పేర్కొన్నారు.
<
>