"నరేంద్ర మోదీ ప్రధాని అయినా.. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా.. శ్రీరాముడు మాత్రం ఇంకా టెంట్లోనే ఉండాల్సి వస్తోంది. దయచేసి ఈ నాయకులంతా ఆయనకు గుడి కట్టిస్తే నేను సంతోషిస్తాను" అని బీజేపీ నేత సురేంద్ర సింగ్ తన సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు. యూపీ బీజేపీ ఎమ్మెల్యే అయిన సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, మోదీతో పాటు ఆదిత్యనాథ్ కూడా శ్రీరాముడికి గుడిని నిర్మించాలనే విషయంలో పూర్తిగా ఫెయిలయ్యారని తెలిపారు.
భారత ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా హిందూ మతానికి చెందిన వారని.. కానీ వారి ప్రభుత్వం మాత్రం రాముడికి గుడి కట్టించే విషయంలో మీనమేషాలు లెక్కించడం శోచనీయమని సురేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. హిందూ సమాజంతో పాటు భారతదేశానికి ఇది చాలా బాధాకరమైన విషయమని.. అయోధ్యలో శ్రీరాముడి గుడి కట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని సింగ్ హితవు పలికారు. రాజ్యాంగం కన్నా భగవంతుడు, నమ్మకం అనేవి చాలా గొప్పవనే విషయాన్ని ప్రధాని గుర్తుపెట్టుకోవాలని సింగ్ సూచించారు.
ఈ సంవత్సరం అక్టోబరు 29వ తేదిన సుప్రీంకోర్టు అయోధ్య రామమందిరం కేసును వచ్చే ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గతంలో ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు వివాదాస్పదమైన అయోధ్య భూభాగాన్ని మూడు భాగాలుగా విభజించాలని పేర్కొనగా.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మళ్లీ కేసు నమోదైంది. 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించారు. అయితే రామమందిరాన్ని కూలగొట్టి.. ఈ మసీదును నిర్మించారన్న వాదన కూడా ఉంది. ఈ వాదనకు బలాన్ని ఇస్తూ.. డిసెంబరు 6, 1992 తేదిన పలు హిందూ సంఘాలు, బాబ్రీ మసీదును కూలగొట్టాయి.