ఢిల్లీ: ఇటీవలే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జి గత రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురి మృతికి మౌన సాక్షిగా నిలిచింది. నిన్న శుక్రవారం ఉదయం సిగ్నేచర్ బ్రిడ్జిపై ఉన్న డివైడర్ని ఓ ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే శనివారం ఉదయం ఇదే సిగ్నేచర్ బ్రిడ్జిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన వ్యక్తి కూడా మృతి చెందడంతో ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జిపై రెండు రోజుల్లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టయింది. నవంబర్ 5న ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జిపై వరుసగా మోగుతున్న మృత్యు ఘంటికలు ప్రస్తుతం అక్కడికి వస్తున్న సందర్శకులను హడలెత్తిస్తున్నాయి.
తూర్పు ఢిల్లీని ఈశాన్య ప్రాంతంతో అనుసంధానం చేస్తూ ఢిల్లీలోని యమునా నదిపై నిర్మించిన ఈ సిగ్నేచర్ బ్రిడ్జికి దేశంలోనే తొలి అసిమెట్రికల్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి (సమరూప రహిత వేళ్లాడే తీగల వంతెన)గా పేరుంది.