New Chitose Airport: ప్రయాణికులు అందరూ విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. విమాన సిబ్బంది కూడా టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఓ చిన్న వస్తువు విమానాశ్రయంలో కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రిటైల్ స్టోర్‌లో కత్తెరలు కనిపించలేదు. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు విమానాశ్రయాన్ని జల్లెడ పట్టారు. ఎయిర్‌పోర్టులో ప్రతి ఒక్కరిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల కారణంగా విమానాలు చాలా ఆలస్యంగా చేరుకోవడం.. పదుల సంఖ్యలో విమానాలు రద్దవడం జరిగింది. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది.
Also Read: Sheikh Hasina: తొలిసారి నోరు విప్పిన షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌లో పరిస్థితికి అమెరికానే కారణం?
జపాన్‌లో హక్కైడ్ ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఉన్న న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ జపాన్‌లో ప్రధానమైన విమానాశ్రయం. అత్యంత ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఈ విమానాశ్రయంలోని ఓ రిటైల్ దుకాణంలో ఆగస్టు 17వ తేదీ శనివారం రోజున కత్తెర కనిపించకుండా పోయింది. స్టోర్‌లో ఉన్న కత్తెరలు కనిపించకపోవడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కత్తెర కోసం వెతికారు. ఎంత వెతికినా కత్తెర జాడ కనిపించలేదు.
Also Read: Brazil Plane Crash: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.. విమానంలోని మొత్తం 62 మంది మృతి
రెండు గంటలు వెతికినా కత్తెర లభించకపోవడంతో 36 విమాన సేవలను రద్దు చేశారు. ఇక 201 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. సేవల అంతరాయానికి సంబంధించి ఎయిర్‌పోర్టు అధికారులు కీలక ప్రకటన చేశారు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. అయితే కత్తెర కోసం ఇంత హడావుడి చేయడంపై వివరణ ఇచ్చారు. 'కనిపించకుండాపోయిన కత్తెరను ఎవరైనా ఉగ్రవాది ఆయుధంగా చేసుకునే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టాం' అని తెలిపారు.
అయితే ఇంత హడావుడి చేసిన తర్వాత ఆసక్తికర విషయం తెలిసింది. విమానాలు రద్దు, ఆలస్యంగా టేకాఫ్ కావడం అంత వృథా అని తేలింది. చివరకు కనిపించకుండాపోయిన ఆ కత్తెర స్టోర్‌లోనే కనిపించడం గమనార్హం. ఈ విషయం తెలుసుకుని భద్రతా సిబ్బంది విస్తుపోయింది. ఇంత హడావుడి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన కత్తెర విషయం తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు. కాగా ఇంత చిన్న విషయాన్ని సక్రమంగా చూసుకోకుండా విమానాల ఆలస్యం, రద్దుకు కారణమైన స్టోర్ నిర్వాహకులపై అక్కడి అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook