రాంచీ: రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు రాంచిలోని రిమ్స్(రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్) వైద్యులు తెలిపారు. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ నిలకడగా లేవని వైద్యులు వెల్లడించారు. పశు దాణా కుంభకోణం కేసులో 2017లో 14 ఏళ్ల జైలు పడిన లాలూ బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తూ పలు ఆరోగ్య సమస్యలతో రిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే.
లాలూ ప్రసాద్ యాదవ్ రిమ్స్‌లో చేరి అనారోగ్యం బారినపడినప్పటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తోన్న డాక్టర్ డీకే ఝా ప్రస్తుతం లాలూ పరిస్థితిపై స్పందిస్తూ.. ఆయన రక్తంలో ఇన్పెక్షన్ వ్యాపించిందని, కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని తెలిపారు. చికిత్సలో భాగంగా లాలూ తీసుకున్న యాంటీబయోటిక్ మెడిసిన్లు ఆయన కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఝా పేర్కొన్నారు.