అమరావతి: మద్యపాన నిషేధంలో భాగంగా ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించి, మద్యం దుకాణాల పనివేళలను కుదించిన ఏపీ సర్కార్ తాజాగా బార్ల సమయాన్ని కూడా తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటున్నాయి. రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు, 12 గంటల వరకు ఫుడ్ సర్వింగ్‌కు అనుమతి ఉంది. అయితే, అనధికారికంగా చాలా బార్లలో రాత్రి 12 వరకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.
ఇదిలావుండగా ఇటీవల దుకాణాల సమయాన్ని ఒకేసారి మూడు గంటలు తగ్గించిన అనంతరం బార్లకు కూడా అదే రీతిలో పనివేళలు కుదించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆయా అంశాలపై కసరత్తు చేస్తోన్న ఎక్సైజ్‌శాఖ బార్ల సమయాన్ని ఒక గంట తగ్గించేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందులా కాకుండా రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అమ్మకాలకు అనుమతించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు చేసింది. అయితే, ఎక్సైజ్ శాఖ చేసిన ఈ ప్రతిపాదనలపై సర్కార్ ఎలా స్పందించనుందా అనేదే ప్రస్తుతం తెలియాల్సి ఉంది.