హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్ల విచారణల సందర్భంగా ఇప్పటికే అటు ఆర్టీసీ యాజమాన్యానికి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు సంధించిన తెలంగాణ హైకోర్టు.. తాజాగా గురువారం నాడు సైతం పలు అంశాలపై నిగ్గదీసింది. కేంద్రం నుంచి అనుమతి రాకుండానే, ఏపీఎస్ ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియ చేపట్టకుండానే టిఎస్ఆర్టీసి పేరిట మరో కొత్త స్వతంత్ర సంస్థను ఎలా ఏర్పాటు చేస్తారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఏపీఎస్ ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజనకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున.. అప్పటి వరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టిఎస్ఆర్టీసిని ఏర్పాటు చేశామని తెలంగాణ సర్కార్ కోర్టుకు నివేదించింది. టిఎస్ఆర్టీసీ సమ్మెపై గురువారం విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కారణాలు ఏవైనా.. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసి కార్మిక సంఘాల వైఖరి కారణంగా రాష్ట్రంలోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. కనీసం సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం రూ.49 కోట్లు విడుదల చేయాలని కోరగా.. అందుకు ప్రభుత్వం నిరాకరించడం ఏంటని ఒకింత అసహనం వ్యక్తంచేసిన కోర్టు.. అసలు ఈ విషయంలో ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఆలోచన ఉందా లేదా అని నిలదీసింది. ఓవైపు ప్రజా సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్లు వెచ్చిస్తోన్న ప్రభుత్వం ఆర్టీసికి కేవలం రూ.49 కోట్లు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతోందని కోర్టు ప్రశ్నించడం గమనార్హం.