నాగౌర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు(Road accident in Rajasthan) ప్రమాదం చోటుచేసుకుంది. రెండు మినీ బస్సులు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి, నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. నాగౌర్ జిల్లాలోని కుచమాన్ వద్ద శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్, షోలాపూర్ ప్రాంతాల నుంచి హర్యానాలోని హిసార్లో ఉన్న ఓ మత గురువును కలిసేందుకే వెళ్తుండగా ముందుగా వెళ్తున్న బస్సు రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఓ పశువును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఇంతలోనే వేగంగా వెనుకే వస్తున్న బస్సు డ్రైవర్ కూడా అదుపు తప్పడంతో రెండు బస్సులు ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి.
ఈ దుర్ఘటనలో 11మంది అక్కడికక్కడనే చనిపోయారు. మృతదేహాలు, రక్తంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.