Medaram tribal festival | మేడారం జాతర తేదీలు ఇవే

మేడారం జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తూ.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

Last Updated : Nov 26, 2019, 08:55 PM IST
Medaram tribal festival | మేడారం జాతర తేదీలు ఇవే

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగే మేడారం జాతరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీతో పాటు పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు ఈ జాతరకు తరలి వస్తుంటారు. అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో మూడు రోజుల పాటు మేడారం జాతర జరగనుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తూ.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తాజాగా సంక్షేమ భవన్‌లో మేడారం జాతర ఏర్పా ట్లపై సమావేశం నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారామె. జాతరకు డిసెంబర్‌ చివరి వారం నుంచే భక్తుల తాకిడి ఉంటుంది కనుక.. డిసెంబర్‌ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.   
    
జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్, ఇతర వసతులను పరిశీలించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించేందుకు వీలుగా పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలన్నారు. జాతరను ప్లాస్టిక్‌ రహిత జాతరగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలు, పాల ఉత్పత్తుల సరఫరా కోసం విజయ డైరీని భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందని.. ఆ నిధుల సహాయంతో భక్తులకు సౌకర్యాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ చేపడతామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు

Trending News