పోలవరం సమస్య తెగేనా..?

   

Last Updated : Nov 12, 2017, 07:03 PM IST
 పోలవరం సమస్య తెగేనా..?

ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు.. జాతీయ ప్రాజెక్టుగా హోదా పొందినా.. ఇంకా పనులు నత్తనడకగానే నడుస్తున్నాయి. కొన్ని పనులకు కొర్రీలు కూడా పడుతున్నాయి. లెక్కల ప్రకారం ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.53,800 కోట్లని ప్రకటించినా.. ఇప్పుడు మళ్లీ పాతలెక్కల ప్రకారం 12 వేల కోట్లే ఇస్తామని కేంద్రం అంటోంది. అలాగే పదే పదే రాష్ట్రం నుండి పంపుతున్న డిజైన్లు కూడా వెనక్కి వస్తున్నాయి. అలాగే వీలైతే కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టే కడితే ఎలా ఉంటుందనే విషయం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్రం నుండి ఇలాంటి అభ్యంతరాలు వస్తున్నాయని పలువురు జలవనరుల నిపుణులు అంటున్నారు.  ఈ మధ్యనే కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి పోలవరం ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లిన తర్వాత.. ఈ అభ్యంతరాలు మరీ ఎక్కువ అయ్యాయి. చంద్రబాబుతో ఆయన నవ్వుతూ మాట్లాడుతూ.. పోలవరం మీద రాష్ట్రం తీరు బాగానే ఉందని చెబుతున్నా.. కేంద్రం నుండి అధికారులు వచ్చి రోజుకో సమస్యను ప్రస్తావిస్తుండడంతో అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అన్న అభిప్రాయం పలువురు రాజకీయ నిపుణుల్లో కలుగుతోంది.

ఈ ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ నష్టాల్లో ఉన్న క్రమంలో.. తాజా ఉత్తర్వులతో మళ్లీ టెండర్లు పిలుస్తే బాగుంటుందని చంద్రబాబు అడిగినా.. కేంద్రం ప్రభుత్వం ఎందుకో ప్రస్తుతం వద్దని చెప్పడం గమనార్హం. పాత కాంట్రాక్టరుతోనే పనులు చేయించుకోమని చెప్పడంలో ఆంతర్యమేమిటో కూడా తెలియడం లేదు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మించాలని ఎప్పుడో ప్రభుత్వం భావించింది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని ఇటీవలే అనేక ఆపసోపాలు పడుతూ జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం పూర్తయితే..  విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక,  ముఖ్యంగా విశాఖలో తాగునీటి అవసరాలు,  తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీరుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 80 టి.ఎం.సీల గోదావరి నీళ్లని కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు.

Trending News