రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం.. అస్సాంలో ఆరని అగ్గి

అస్సాం రాజధాని గౌహతిలో కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమాలు చేపట్టారు. ఐతే వారిని అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Last Updated : Dec 12, 2019, 07:24 PM IST
రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం.. అస్సాంలో ఆరని అగ్గి

గౌహతి: అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లు- 2019కు వ్యతిరేకంగా రాజుకున్న అగ్గి ఇంకా కొనసాగుతూనే ఉంది. అస్సాం అంతటా నిరసన జ్వాల రగులుతూనే ఉంది. ఓ వైపు బుధవారం పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. అప్పటి నుంచే మొదలైన ఆందోళనలు గురువారం సైతం కొనసాగుతూనే ఉన్నాయి. అస్సాం రాజధాని గౌహతిలో కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమాలు చేపట్టారు. ఐతే వారిని అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకారుల ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు.. రోడ్ల మధ్యలోనే పలు వాహనాలకు నిప్పంటించారు. దీంతో గౌహతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఐతే, గౌహతిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. బుధవారం రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో పౌరసత్వ సవరణ బిల్లు- 2019కు ఆమోదం లభించడం అక్కడి ఆందోళనకారులకు మరింత మింగుడుపడని అంశంగా మారింది. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు- 2019కు ఆమోదం లభించడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం 11 గంటలకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రకటించిన నేపథ్యంలో అస్సాంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Trending News