పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రాజుకున్న అగ్గి ఇంకా చల్లారడం లేదు. అసోంలో భగ్గుమన్న నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేస్తున్న నిరసన హింసాత్మకంగా మారింది.
పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుపై ఈశాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోందని, ఈ బిల్లుపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఎన్డిఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు చట్టం 2019 ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో అస్సాంలో ఆందోళనకారులు రోడ్డెక్కి ఉద్యమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా అస్సాంలో పలుచోట్ల విధ్వంసకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అస్సాం రాజధాని గౌహతిలో కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమాలు చేపట్టారు. ఐతే వారిని అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.