టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం ఉదయం విమానం కూలిపోయిన దుర్ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 176 మంది దుర్మరణం చెందారు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమిని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన బోయింగ్ 737 విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపట్లోనే టెహ్రాన్‌లో కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఇరాన్ జాతీయ మీడియా సంస్థ ఐఎస్ఎన్ఏ పేర్కొంది. ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.12 గంటలకు బోయింగ్ విమానం ఇమాం ఖోమిని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవగా... అనంతరం 8 నిమిషాల వ్యవధిలోనే విమానం కూలిపోయిందని ఐఎస్ఎన్ఏ కథనం వెల్లడించింది. సాంకేతిక లోపం కారణంగా ఆకాశంలో ఉన్నప్పుడే మంటలు అంటుకున్న విమానం.. నేలకూలిన వెంటనే భారీ శబ్ధంతో పేలిపోయింది. ప్రమాదానికి గురైన విమానాన్ని ట్విన్ ఇంజిన్ కలిగిన ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ బోయింగ్ 737-800 విమానంగా గుర్తించారు.
తొలుత ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 180 మంది ఉన్నట్టు వార్తలొచ్చినప్పటికీ ఆ తర్వాతే అసలు మృతుల సంఖ్య ఎంతనేది వెలుగులోకొచ్చింది.