Harish Rao: విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి.. హరీష్ రావు ఫైరింగ్ స్పీచ్

Harish Rao Fires on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారని.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 19, 2024, 12:58 PM IST
Harish Rao: విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి.. హరీష్ రావు ఫైరింగ్ స్పీచ్

Harish Rao Fires on Revanth Reddy: ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని.. రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి..? అని ప్రశ్నించారు.

ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు ఏడాది అయినా అతీగతీ లేదని.. డిక్లరేషన్‌లో చెప్పిన మొట్ట మొదటి హామీ 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15 వేల భరోసా దిక్కులేదని.. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న 12వేలు ఇవ్వనేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేసారు. ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? మీ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లింది. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టింది. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్న పరిస్థితి. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు, స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు, జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు, డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు, నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు, బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్‌గా రోడ్ల మీదకు తెచ్చినవు.  

కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవు. మీరు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు రేవంత్ రెడ్డి, సక్సెస్ ఫుల్ గా ప్రజల్నిమోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలి. ఏడాది కావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. అద్భుతాలు చేసామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండి. గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయండి. మీ వైఫల్యాలను గుర్తించి మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 

మాట ఇచ్చాం, పూర్తి చేసామని మహిళలకు ఇచ్చిన హామీల పట్ల కోట్లు వెచ్చించి ప్రకటనలు జారీ చేసినంత మాత్రాన అబద్దాలు నిజమైపోవు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీగా మహిళలకు చెప్పిన రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారో, కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో, స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని, తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం." అని హరీష్‌ రావు అన్నారు.

Also Read: Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం.. 

Also Read: New Airports: ఏపీ, తెలంగాణల్లో కొత్తగా 10 విమానాశ్రయాలు, ఎక్కడెక్కడంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News