Lagacharla Farmers: లగచర్ల రైతుల విజయం.. రేవంత్‌ రెడ్డి మరో యూటర్న్‌!

Revanth Reddy Back Step Lagacharla Land Acquisition Notification Withdrawn: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల రైతుల ఉద్యమానికి తలొగ్గి అక్కడ భూసేకరణను ఉపసంహరించుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 29, 2024, 02:51 PM IST
Lagacharla Farmers: లగచర్ల రైతుల విజయం.. రేవంత్‌ రెడ్డి మరో యూటర్న్‌!

Lagacharla Land Acquisition: ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్‌ రెడ్డికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గౌతమ్‌ అదానీ వ్యవహారంలో యూటర్న్‌ తీసుకున్న రేవంత్‌ రెడ్డి తాజాగా తన సొంత కొడంగల్‌ నియోజకవర్గంలో లగచర్లలో చేయాలనుకున్న ఫార్మా క్లస్టర్‌పై వెనక్కి తగ్గారు. లగచర్ల పరిసర ప్రాంతాల్లో చేపట్టాలనుకున్న భూసేకరణను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. లగచర్ల రైతుల ఉధృత పోరాటానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తలొగ్గింది. దీంతో లగచర్లతోపాటు పరిసర గ్రామాల్లో ఆనందం నిండింది.

ఇది చదవండి: Mallampally: ఏడాది సంబరాల్లో మంత్రి సీతక్కకు రేవంత్‌ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్‌!

వికారాబాద్‌ జిల్లా కొడగంల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉప సంహరించుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 1వ తేదీన ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇది చదవండి: Telangana: 8 రోజులపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది సంబరాలు.. ఏ రోజు ఏమిటో తెలుసా?

బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం హైదరాబాద్‌ శివారులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీని నిర్లక్ష్యం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా విలేజ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలంతోపాటు మరికొన్ని గ్రామాలను కలిపి ఫార్మా విలేజ్‌ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు భూసేకరణ చేపట్టగా స్థానిక రైతులు అందరూ ఒక్కతాటి పైకి ఉద్యమం చేపడుతున్నారు. కొన్ని నెలలుగా వీరి ఉద్యమం కొనసాగుతుండగా భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడి సంఘటనతో రైతుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చుకుంది.

అక్కడకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌ రెడ్డి తదితర అధికారులపై లగచర్లతోపాటు ఫార్మా విలేజ్‌లో భూములు కోల్పోతున్న రైతులు అందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తదనంతరం జరిగిన పరిణామాలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. ఇదే ఆందోళనలో సంబంధం లేకపోయినా బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడం వివాదం రేపింది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో రైతులను ఇష్టారీతిన అరెస్ట్‌ చేయడం.. వేధింపులకు గురి చేయడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు అధికారుల సూచన మేరకు రేవంత్‌ రెడ్డి దిగివచ్చి లగచర్లలో భూసేకరణను విరమించుకున్నారు. 

సంబరాల్లో గ్రామస్తులు
భూసేకరణ విరమించుకోవడంతో లగచర్ల రైతులు సంబరాల్లో మునిగారు. అరెస్ట్‌ చేసిన రైతులను కూడా విడుదల చేయాలని లగచర్ల గ్రామస్తులు కోరుతున్నారు. కాగా రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తమ విజయమని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించుకుంది. ఇప్పటికైనా రైతులను విడిచి పెట్టాలని గులాబీ పార్టీ డిమాండ్‌ చేసింది. రైతుల ఉద్యమానికి రేవంత్‌ రెడ్డి తలొగ్గడని.. మిగతా హామీల విషయమై ఇదే తరహా పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News