ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ రావు.. పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు. త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి నూతన అధ్యక్షులు రాబోతున్నారన్న ఆయన- అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాం అని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లనుంది. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాం. అలాగే ఏపీలోనూ త్వరలోనే మార్పులు రాబోతున్నాయని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన నిజాం పాలనను తలపిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టంలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ.. రాజకీయ అవసరాల కోసమే టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు.
ఆర్టికల్ 370, రామ మందిరం, త్రిపుల్ తలాక్ వంటి అంశాల్లో ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే సీఏఏపై వివాదం చేస్తున్నారని చెబుతూ..
ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జాతి సమైక్యతకు
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వంటి చట్టాల అవసరం ఎంతైనా ఉందని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
ముస్లిం యువతపై ప్రశంసలు.. ప్రశ్నలు..
ముస్లిం యువత జాతీయ జెండాతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని ముస్లిం యువతను అభినందించిన విద్యాసాగర్ రావు.. అదే సమయంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమన గీతాలను అలపించి కార్యక్రమాన్ని ముగించగలరా అని ప్రశ్నించారు.
తెలంగాణలో సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పోరాటం చేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో జరుగుతున్నప్పటికీ తెలంగాణలో జరగకపోవడం సరికాదు.
మాతృభాషను కాపాడుకోవాలి..
అంతర్జాతీయ మాతృభాషని ఘనంగా జరుపుకుని తెలుగు భాషను పరిరక్షించుకోవాలి. మాతృభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పేడమే లక్ష్యంగా రేపు హైదరాబాద్ వేదికగా కార్యక్రమం ఉంటుందని.. ఇంట్లో ఒక భాష, పాఠశాలలో ఒక భాష ఇలా విద్యార్థులలో సంఘర్షణ లేకుండా చూడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.