యాదాద్రి భువనగిరి: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూసే బాధ్యతను ప్రభుత్వాలు పోలీసులకే అప్పగించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సైతం తమ ప్రాణాలనుపణంగా పెట్టి లాక్ డౌన్ అమలయ్యేలా చూస్తోంటే... మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పోలీసులు మాత్రం బాధ్యాతారాహిత్యంగా ప్రవర్తించి పోలీసు వ్యవస్థే తలదించుకునేలా చేశారు. పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో లాక్ డౌన్ పక్కాగా అమలయ్యేలా చూడాల్సిందిపోయి... ఏకంగా పోలీసు స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్ ముందు భాగంలోనే టెంట్స్ వేసి బర్త్ డే పార్టీ చేసుకున్నారు. అది కూడా కేవలం పోలీసు సిబ్బందితో మాత్రమే సరిపెట్టుకోలేదు... మండల పరిధిలోని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులను, ఇతర సన్నిహితమిత్రులను కూడా ఆహ్వానించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఓవైపు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణమే నేడు అంత సింపుల్‌గా జరిగిపోతే... ఇక్కడి పోలీసులు మాత్రం కానిస్టేబుల్ కూతురి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా చేసేందుకు ఆరాటపడ్డారు. లాక్ డౌన్ సంగతలా పక్కన పెడితే.. కనీసం కరోనా వ్యాప్తికి కారకులం కాకూడదనే విషయాన్ని కూడా మరిచి అందరూ కలిసి కానిస్టేబుల్ కూతురి బర్త్ డే పార్టీ నిర్వహించారు.
పోలీసుల నిర్వాకం సంగతి అటుంచితే.. గ్రామాల్లో లాక్ డౌన్ అమలయ్యేలా చూడాల్సిన ప్రజాప్రతినిధులు సైతం బాధ్యతతో వ్యవహరించలేదు. చట్టాన్ని అమలయ్యేలా చూడాల్సిన పోలీసులే ఆహ్వానించాకా ఇక వెళ్లక తప్పుద్దా అని అనుకున్నారో ఏమో కానీ.. ప్రజాప్రతినిధులు సైతం పోలీసు స్టేషన్‌లో జరిగిన బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.
Read also : ఏపీలో కరోనాతో తొలి మరణం.. ఆస్పత్రిలో చేరిన గంటలోనే కన్నుమూత
సోషల్ డిస్టన్సింగ్ ఏది ?
జనం గుంపులు గుంపులుగా ఉన్న చోట వాళ్లలో ఎవరికైనా కరోనావైరస్ ఉన్నట్టయితే.. ఆ గుంపులో ఉన్న వాళ్లకు కూడా ఆ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందనే భయంతోనే జనం ఇళ్లనుంచి బయటకు రాకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సోషల్ డిస్టన్సింగ్ మెయింటెన్ చేయాల్సిందిగా అనుక్షణం ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి అన్ని స్థాయిల్లో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా నిత్యం ఇదే విషయాన్ని చెబుతున్నారు. అసలు కేంద్రం లాక్ డౌన్ తీసుకురావడం వెనుకున్న అంతరార్థం కూడా ఇదే కదా. మరి గుండాల పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు గుర్తుకురాలేదా ? లేక మనమే పోలీసులం కదా... మనల్ని అడిగేదెవ్వరు అని అనుకున్నారా వాళ్లకే తెలియాలి.
Read also : Flash: ఏపీలో కొత్తగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తింపు
పోలీసులకు వేరే రూల్స్ ఉన్నాయా ?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తప్పనిసరి అవసరాలపై రోడ్లపైకి వస్తున్న తమను చితగ్గొట్టి వెనక్కి పంపిస్తున్న పోలీసులే మరోవైపు ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలా అని జనం ప్రశ్నిస్తున్నారు. పోలీసుల డైరీలో జనానికి ఓ రూల్.. తమకు ఓ రూల్ ఉంటుందా అని ఈ వీడియో చూసిన నెటిజెన్స్ నిలదీస్తున్నారు.
జనాలను లాక్ డౌన్ పాటించేలా చేస్తోన్న పోలీసులే ఇంతటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలా అనే ప్రజల ప్రశ్నలకు ఈ పోలీసులు ఏం జవాబు చెప్పుకుంటారో మరి.
పోలీసు స్టేషన్ ఆవరణలోనే బర్త్ డే పార్టీ.. పోలీసుల నిర్వాకంపై పబ్లిక్ సీరియస్ - వీడియో