పశ్చిమ రైల్వే సోమవారం ఉదయం 10.30 గంటలకు బోరివలి-చర్చ్ గేట్ మార్గంలో దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) లోకల్ రైలును ప్రారంభించింది. పశ్చిమ రైల్వే చీఫ్ ప్రతినిధి రవీందర్ భకర్ మాట్లాడుతూ, ఈ ఏసీ లోకల్ ట్రైన్ యొక్క చివరి ట్రయిల్ రన్ సీనియర్ అధికారుల సమక్షంలో నిర్వహించబడి.. విజయవంతమైందన్నారు. ఈ ఏసీ లోకల్ రైలు ప్రారంభంలో చర్చ్ గేట్-బోరివలీ మార్గంలో మాత్రమే నడుస్తుంది. జనవరి 1 నుంచి చర్చ్ గేట్ నుంచి విరార్ వరకు రోజుకు 12 రాకపోకలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఏసీ రైలు యొక్క 12 సర్వీసులలో, ఎనిమిది చర్చ్ గేట్- విరార్ మధ్య వేగవంతమైన లోకల్ రైళ్లను నడపనున్నారు. ముంబై సెంట్రల్, దాదర్, బాంద్రా, ఆంధేరి, బోరివలి, భయందెర్, వాసై రోడ్ ప్రధాన స్టాప్స్ గా ఉండనున్నాయి. అలాగే చర్చ్ గేట్-బోరివలిల మధ్య మూడు ఫాస్ట్ సర్వీసులు నడుస్తాయి. స్టాప్స్: ముంబై సెంట్రల్, దాదార్, బాంద్రా, అంధేరి స్టేషన్. నెమ్మది వెళ్లే ఏసీ లోకల్ ట్రైన్ ను మహాలక్ష్మి నుండి బోరివలి మధ్య ఉదయం నడుస్తుంది. తాజాగా ప్రారంభించిన రైలు సర్వీసులపై పశ్చిమ రైల్వే డిస్కౌంట్ లను ప్రకటించింది. వారం, పదిహేను, నెల, మూడు, ఆరు నెలలపాటు పాస్ లపై డిస్కౌంట్ ధరల్లో ప్రయాణించవచ్చు.