ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యను నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీచేసింది. 1985వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన మాలకొండయ్య స్వస్థలం ఒంగోలు జిల్లా. డిసెంబర్ 31వ తేదీ ప్రస్తుత డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మాలకొండయ్యను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. నూతన పోలీస్ బాస్ మాట్లాడుతూ.. ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలని.. నిబద్ధత కలిగిన వ్యక్తి సాంబశివరావని.. ఆయన సలహాలు తీసుకుంటానని చెప్పారు.
డీజీపీగా మాలకొండయ్య నియామకంతో ఖాళీ అయినా ఆర్టీసీ ఎండీ పోస్టును త్వరలో భర్తీ చేయనుంది సర్కార్. కాగా.. ఆర్ఫీ ఠాకూర్, ద్వారకా తిరుమలరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఇదీ కొత్త పోలీస్ బాస్ నేపథ్యం..
మాలకొండయ్య మొదట వరంగల్ జిల్లాలో ములుగులో అదనపు సూపరింటెండెంట్ (ఏఎస్పీ)గా పనిచేశారు. ఏపీఎస్పీ కమాండెంట్ గా, మెదక్, ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ గా మరియు విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు.
మాలకొండయ్య ఏసీబీ జాయింట్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్ గా, గుంటూరు, ఏలూరు రేంజ్, పోలీస్ ట్రైనింగ్ డీఐజీగా పనిచేశారు. పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ ఐజీగా, ఏసీబీ అదనపు డైరెక్టర్ గా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ గా, ఏపీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా , ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు.