సాధారణంగా చాలామంది తమకి కానీ లేదా తమ కుటుంబసభ్యులకి కానీ జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని దీక్షలు, నిరసనలు చేపడుతుంటారు. కానీ హైదరాబాద్లోని ఓ మహిళా డాక్టర్ మాత్రం ప్రదాని నరేంద్ర మోడీ భార్యకు మద్దతుగా ఆయనపైనే యుద్ధం ప్రకటించారు. అది కూడా ఒకటి, లేదా రెండు రోజులు కాదు.. ఏకంగా గత ఏడు రోజుల నుంచి ఆమె కూకట్పల్లిలోని తన నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్నారు. ప్రధానిగా దేశాన్ని ఏలుతున్న మోడీ తన నిజ జీవితంలో తన భార్య జశోదాబెన్కే అన్యాయం చేస్తున్నారని ఆ మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను చిన్నప్పుడు, తనకి ఏమీ తెలియని వయస్సులో చేసిన బాల్య వివాహానికి తాను వ్యతిరేకం అని చెప్పుకు తిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. మరి ఆమెకి ఇంకా సమాజంలో తన భార్య హోదాను ఎందుకు కల్పిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదా బెన్ మోడీతో కలిసి వుండటానికి సిద్ధంగా వున్నప్పటికీ.. ఆయన మాత్రం ఆమెని పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నారని డా.సుశీల ఆరోపించారు. బాల్య వివాహం చేసుకున్నానే తప్పితే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెబుతున్న మోడీ మరి ఆమెకు ఎందుకు హై సెక్యురిటీ కల్పించడం జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. ఆమెని తన భార్యగా అంగీకరించనప్పుడు ఆమెకు ప్రధాని భార్య హోదా కల్పించాల్సిన అవసరం ఏముంది ? ఆమెకి ప్రధాని భార్యగా హై సెక్యురిటీ కల్పిస్తున్నారు అంటే ఆమె తన భార్య అని మోడీ అంగీకరించినట్టే కదా అని నిలదీస్తున్నారామె.
జశోజాబెన్ని తన భార్యగా అంగీకరించి భద్రత కల్పిస్తున్న మోడీ గారు ఆమెని ఇంటికి తీసుకొచ్చుకుంటే బాగుంటుందని, లేని పక్షంలో ఆమెకి విడాకులు ఇచ్చి స్వేచ్ఛ కల్పించాలని డా సుశీల అభిప్రాయపడ్డారు. మోడీ భార్య జశోదాబెన్ కి జరుగుతున్న అన్యాయంపై సాటి మహిళగా తాను స్పందిస్తున్నాను అని చెబుతున్న ఆమె.. భవిష్యత్లో జనం మోడీని ఆదర్శంగా తీసుకుని వాళ్లు కూడా తమ భార్యలని వదిలేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
క్రమక్రమంగా తన వాదనకు సోషల్ మీడియాలో బలం చేకూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజెన్స్ నుంచి తనకు మద్ధతు లభిస్తోంది. ఆనోటా ఈనోటా తన నిరసన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వెళ్తుందని, ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నాను అని చెబుతున్నారు డా సుశీల. ఏకంగా దేశ ప్రధానిపైనే యుద్ధం ప్రకటించిన డా సుశీల ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుందో వేచిచూడాల్సిందే మరి!!