2007లో విజయవాడలోని ఇబ్రహీంపట్నం హాస్టల్లో దారుణహత్యకు గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసులో గతంలో పిడతల సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్టు చేసి దోషిగా నిర్థారించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా.. మలి తీర్పులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న కోర్టు ప్రకటనను వెలువరించింది. అయితే అప్పటికే సత్యంబాబు తొమ్మిదేళ్లు జైలుశిక్ష అనుభవించడం గమనార్హం. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి పునర్విచారణ జరపాలని ఏపీ తెలంగాణ ఉమ్మడి హైకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బాధ్యతలు అప్పగించింది.
కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలని కూడా తెలిపింది. విజయవాడలో పదేళ్ల క్రితం జరిగిన ఆయేషా మీరా కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. సెల్ఫోన్ దొంగతనం కేసులో ముద్దాయిగా వచ్చిన సత్యంబాబును కేసులో కావాలనే ఇరికించారనేది కూడా కొందరి వాదన. అయితే పదేళ్ళ తర్వాత మళ్లీ ఆయనను ఏ కారణంగా నిర్దోషిగా ప్రకటించారన్న విషయంలో కూడా పలు సందేహాలున్నాయని అప్పట్లోనే కొన్ని ప్రజా సంఘాలు తెలిపాయి. అయితే సత్యంబాబు నిర్దోషైతే.. అసలు హత్యకు పాల్పడింది ఎవరు అన్నది ఈ కేసులో ఇప్పటికే పెద్ద మిస్టరీగానే మారింది. ఈ క్రమంలో అసలు హంతకులను కనుక్కోవడం కోసం తాజాగా హైకోర్టు ఈ కేసులో పునర్విచారణకు ఆదేశాలు జారీ చేసింది.