క్రికెట్లో విజయాలు సొంతం చేసుకున్నప్పుడు ప్రశంసలు.. అపజయాలు మూటగట్టుకున్నప్పుడు విమర్శలు సర్వసాధారణం అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ప్రస్తుతం విరాట్ కోహ్లీ విమర్శల పాలవుతుండటం కూడా అటువంటిదే. అతడిని ప్రశంసించిన నోళ్లే ఇప్పుడతన్ని విమర్శిస్తున్నాయి. నిత్యం ఏదో ఓ వైపు నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీని తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ కూడా వేలెత్తి చూపించాడు.
సౌతాఫ్రికన్ టీవీ ఛానెల్ సూపర్స్పోర్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీ ఎక్కువ కాలం కొనసాగగలుగుతాడా అనే సందేహాలు వ్యక్తంచేశాడు. "జట్టును ముందుండి నడిపించే నాయకుడికి సహనం ఎంతో అవసరం. నాయకుడు సహనం కోల్పోతే ఆ ప్రభావం అతడు నాయకత్వం వహిస్తున్న జట్టుపై పడుద్ది. కోహ్లికి ఓపిక లేదని అతడి తీరు చూస్తే అర్థమైపోతుంది. కోహ్లీ చుట్టూ వుండేవాళ్లయినా అతడు ఆవేశం వీడి సహనంగా వుండటం నేర్పించండి" అంటూ కోహ్లీపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు స్మిత్. సౌతాఫ్రికా జట్టుకి అత్యధిక కాలంపాటు కెప్టెన్‌గా పనిచేసిన దిగ్గజ క్రికెటర్‌గా గ్రేమ్ స్మిత్‌కి పేరుంది.
క్రికెటర్లకు విరాట్ కోహ్లీపై కోపం రావడానికి సిరీస్ ఓటమి ఓ కారణమైతే, 2వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా సెంచూరియన్ మైదానంలో ఎంపైర్లతో వాగ్వీవాదానికి దిగడం అతడి క్రమశిక్షణపై తీవ్ర ప్రభావం చూపింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25% కోత విధించడంతో మొదలైన విమర్శలు అంతటితో ఆగలేదు. అనంతరం మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశం సందర్భంగా జర్నలిస్టులపై కోహ్లీ గరం అవడం అతడిని మరింత విమర్శలపాలు చేసిందంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్.