హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. తెదేపాలో సీనియర్ నాయకునిగా ఉంటూ పలు పదవులు చేపట్టిన ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాదులోని కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ముద్దుకృష్ణమనాయుడు 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా వెంకట్రామాపురంలో జన్మించారు. బీఎస్సీ, ఎంఏతోపాటు న్యాయవాద డిగ్రీ పట్టా పొందారు. కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. విద్య, అటవీ, ఉన్నత విద్య మంత్రిగా సేవలందించారు. తెదేపాను విభేదించి కాంగ్రెస్‌లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలిచారు. తిరిగి 2008లో తెదేపాలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి
ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెదేపా ప్రస్థానంలో ముద్దుకృష్ణమనాయుడు పాత్ర కీలకమైనదని.. ఆయన మృతి తనను తీవ్రంగా బాధించిందని చంద్రబాబు అన్నారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పట్ల కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినే ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తదితరులు సంతాపం ప్రకటించారు. టీటీడీపీ నాయకులు కూడా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.