సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించిన విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు

Last Updated : Feb 8, 2018, 12:53 AM IST
సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించిన విరాట్ కోహ్లీ

కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో బుధవారం సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. సఫారీ బౌలర్లు విసిరిన బంతులని ధీటుగా ఎదురుకుంటూ శిఖర్ ధావన్‌తో కలిసి 140 పరుగుల భారీ భాగస్వామ్యాం నమోదు చేసిన కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లో మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. తనతో ఆడుతున్న ఆటగాళ్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పడుతున్నప్పటికీ.. తాను మాత్రం తన వికెట్‌ని కాపాడుకుంటూ 160 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. 

మొట్టమొదట్లోనే రోహిత్ శర్మ వికెట్ పడటంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డంత పనిచేశాడు. 159 బంతుల్లో 2 సిక్సులు, 12 ఫోర్లతో 160 పరుగులు రాబట్టిన కోహ్లీ.. తన వ్యక్తిగత కెరీర్‌లో 3వసారి 150 పరుగులు పూర్తిచేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది రెండవ సెంచరీ కాగా మొత్తం కెరీర్‌లో ఇది 34వ సెంచరీ.
 
ఇదిలావుంటే, టీమిండియా వికెట్లు వెనువెంటనే పడిపోయినా టీమిండియా స్కోర్ పెరగడానికి విరాట్ కోహ్లీ ఎంత ఇన్నింగ్స్ ఎంత కారణమో.. అతడితో కలిసి శిఖర్ ధావన్ (63 బంతుల్లో 76 పరుగులు) చేసిన బ్యాటింగ్ కూడా అంతే ప్రధానమైనది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సాధించిన హాఫ్ సెంచరీ అతడి వన్డే కెరీర్‌లో 25వది కావడం విశేషం. మొత్తంగా విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌లు సఫారీలపై రెచ్చిపోవడంతో టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.

Trending News