Telangana COVID-19 cases latest updates: హైదరాబాద్: తెలంగాణలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,308 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,51,035 మందికి చేరుకుంది. ఎప్పటిలాగే కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలోనూ అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోనే 513 కొత్త కేసులు ఉన్నాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 16 కేసులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఒక జిల్లాలో ఇంత స్వల్ప సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 4,723 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 5,04,970 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో మరో 21 మంది కరోనాతో చనిపోగా (Corona deaths).. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,106 కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 యాక్టివ్ కేసులు (COVID-19 cases) ఉన్నాయి. తెలంగాణలో కరోనా కేసుల రికవరీ రేటు 91.64 శాతం కాగా మరణాల రేటు 0.56 శాతంగా నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదిలావుంటే, మరోవైపు కొత్తగా వ్యాప్తిలోకి వచ్చిన బ్లాక్ ఫంగస్ కేసులపైనా తెలంగాణ సర్కారు ఫోకస్ చేస్తోంది. కొత్తగా ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ లక్షణాలతో (Black fungus symptoms) బాధపడుతున్న వారిని గుర్తించినట్టయితే వెంటనే వారికి చికిత్స అందించడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సిందిగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.