ఈసారి లాంగ్ వీకెండ్‌ని వెంట పెట్టుకుని వస్తున్న హోలీ పండగను ఎప్పటికన్నా ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా హోలీ ఫెస్టివల్‌ని ఇష్టపడే వారు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంటికి దూరంగా వుండేవారు హోలీ పండగకు ఇంటికి వెళ్లి అయినవారితో జరుపుకోవడం ఆనవాయితీ కనుక ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే 54 జంట ప్రత్యేక రైలు సర్వీసుల కింద మొత్తం 500 ప్రత్యేక రైలు సర్వీసులని ప్రవేశపెట్టింది. గతేడాది కేవలం 440 సర్వీసులు హోలీ సీజన్లో రాకపోకలు సాగించగా ఈసారి అంతకన్నా 60 రైలు సర్వీసులు అదనంగా నడవనున్నట్టు తూర్పు రైల్వై విభాగం ప్రకటించింది. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు అధిక రద్దీ సమస్య బారి నుంచి బయటపడేందుకు వీలుగా ఈ ప్రత్యేక సర్వీసులని ప్రవేశపెడుతున్నట్టు తూర్పు రైల్వే విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.
54 సర్వీసులలో హౌరా-ముజఫర్ పూర్ మధ్య 5 సర్వీసులు, హౌరా-రామ్ నగర్ మధ్య 4 సర్వీసులు, మిగతా 45 జంట సర్వీసులు భగల్ పూర్-సహస్త్ర మధ్య రాకపోకలు సాగించనున్నాయి. గతేడాది ఈ ప్రత్యేక రైలు సర్వీసుల వల్ల మొత్తం 6 లక్షల మంది ప్రయాణికులు లబ్ధి పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 7 లక్షల వరకు వుంటుందని ఇండియన్ రైల్వే ఓ అంచనా వేస్తోంది.