లండన్‌లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు రుణాలివ్వడంలో భారతీయ బ్యాంకులు నిబంధనలను బేఖాతరు చేశాయని బ్రిటిష్ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విజయ్ మాల్యా కేసును విచారిస్తున్న లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎమ్మా అర్బట్‌నాట్ ఈ కేసును చిన్న చిన్న రంగుల ముక్కలను కలిపి ఒక బొమ్మగా చేసే జిగ్‌షా పజిల్‌తో పోల్చారు. పలు ఆధారాలను పరిశీలించిన తరువాత ఇప్పటికి తనకు కొంత అవగాహన వచ్చిందని చెప్పారు.
భారతీయ బ్యాంకులు రుణాలివ్వడం కోసం తామే రూపొందించుకున్న స్వంత మార్గదర్శకాలను తుంగలోకి తొక్కాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 9 వేల కోట్ల రూపాయిల మేరకు బ్యాంకులను మోసగించి పారిపోయిన మాల్యాను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో అక్కడి కోర్టులలో కేసు విచారణ జరుగుతోందన్న విషయం తెలిసిందే..! ఈ కేసును జనవరిలో విచారించిన కోర్టు, విజయ్ మాల్యాకు ఏప్రిల్ 2 వరకు బెయిల్‌ను పొడిగించారు.
గత సంవత్సరం ఏప్రిల్‌లో మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ అరెస్టు చేశారు. ఆ తరువాత అతను 650,000 పౌండ్ల విలువైన బాండ్‌తో కూడిన బెయిల్ పై బయటికి వచ్చారు. ఈ కేసుతో పాటు, ఫిబ్రవరి 12న లండన్ కోర్టు సింగపూర్ ఆధారిత ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీకి ఇచ్చిన వాగ్దానం మేరకు 90 మిలియన్ డాలర్లను చెల్లించాలని మాల్యాని ఆదేశించింది. 2014లో బీవోసీ ఏవియేషన్ నుండి విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సేవల కోసం విమానాలను లీజుకు తీసుకున్నారు.