సినీ నటిపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో నిర్మాత అరెస్ట్ !

సినీ నటి నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో ఆమె నటించిన సినిమాను రూపొందించిన నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇది.

Last Updated : Mar 26, 2018, 05:13 PM IST
సినీ నటిపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో నిర్మాత అరెస్ట్ !

ముంబైలో ఓ సినీ నటి నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో ఆమె నటించిన సినిమాను రూపొందించిన నిర్మాతను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే, మిడ్‌డే మ్యాగజైన్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం హీరోయిన్‌గా బిజీ కావాలనే లక్ష్యంతో ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశాన్ని అందుకోవడం కోసం అనిష్ రావ్ అనే నిర్మాతకు రూ. 8 లక్షలు ఇచ్చిన ఓ ఔత్సాహిక నటి.. ఆ తర్వాత అతడు నిర్మించిన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం డబ్బింగ్ దశలో వుంది. ఇదిలావుండగా తాజాగా తనకు అందిన సమాచారం ప్రకారం ఆ సినిమాలో తనను అసభ్యంగా చూపిస్తున్నారని, ఆ చిత్రాన్ని ఓ సాఫ్ట్ పోర్న్ చిత్రంగా మలుస్తున్నారని తెలుసుకున్న ఆ నటి మార్చి19న అంధేరిలో వున్న నిర్మాత అనిష్ రావ్ కార్యాలయానికి వెళ్లింది. 

ఆ సినిమాలో తనని ఎందుకు అసభ్యంగా చూపిస్తున్నారని నిర్మాతను నిలదీసిన ఆ నటి, అలా అయితే, సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తంచేసింది. అందుకు నిర్మాత అనిష్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో " తాను ఇచ్చిన రూ. 8 లక్షల డబ్బును తిరిగి తనకు ఇచ్చేయాల్సిందిగా కోరానని, దీంతో అతడు తనని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడపడితే అక్కడ తాకుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు" అని ముంబైలోని ఒషివరా స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. " డబ్బులు తిరిగి అడిగితే అత్యాచారం చేస్తానని నిర్మాత బెదిరిస్తుంటే, అనిష్ రావ్‌కి అక్కడే వున్న అతడి తల్లి సోనమ్ ఆర్‌జే కూడా మద్దతు పలికింది" అని బాధితురాలు మార్చి24న పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన ఒషివరా పోలీసులు.. అభ్యంతరకరమైన రీతిలో సినిమా ఎడిటింగ్, లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, దోపిడికి పాల్పడిన కేసులో నిర్మాత అనిష్ రావ్‌తోపాటు అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అనిష్ రావ్ తమ అదుపులో వుండగా అతడి తల్లి సోనమ్ ఆర్‌జే పరారిలో వుందని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న డీసీపీ పరంజిత్ సింగ్ దహియా మీడియాకు తెలిపారు. 

Trending News