ఉత్తరప్రదేశ్లో బీజేపీ దళిత ఎంపీ సావిత్రిబాయి ఫూలే తన స్వంత పార్టీపైనే ధ్వజం ఎత్తారు. మోదీ సర్కార్ దళిత వ్యతిరేక పార్టీ అని స్లోగన్స్ చేస్తూ కాషాయ దుస్తులు ధరించి మరీ ర్యాలీలో పాల్గొన్నారు. "మేము రిజర్వేషన్లు అడుక్కొని తెచ్చుకోలేదు. అవి మాకు రాజ్యాంగం కట్టబెట్టిన హక్కు. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా.. దేశంలో రక్తం ఏరులై పారుతుందనడంలో సందేహం లేదు" అని ఆమె తెలిపారు.
లక్నోలోని స్మ్రుతి ఉపవనంలో జరిగిన సంవిధాన్ ఆరక్షన్ బచావ్ ర్యాలీలో పాల్గొన్న ఆమె ప్రైవేటు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. "రిజర్వేషన్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలని ఆరెస్సెస్ లాంటి శక్తులు బీజేపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని మాకు తెలిసింది. ఇదే జరిగితే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు అన్నీ ఇన్నీ కావు" అని సావిత్రిబాయి పూలే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు
ర్యాలీ ప్రారంభించే ముందు సావిత్రిబాయి ఫూలే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేశారు. అలాగే బహుజన సమాజపార్టీ నేత కాన్షిరామ్ విగ్రహానికి కూడా పూలదండ వేశారు."నేను బీజేపీ ఎంపీనే.. కాదనను. కానీ అంతకు ముందు నేను ఓ దళిత బిడ్డను. ఒకవేళ నన్ను పార్టీ నుండి బహిష్కరించినా ఏం ఫరవాలేదు. నేను దళిత హక్కుల కోసం నా పోరాటాన్ని మాత్రం ఆపను" అని సావిత్రాబాయి పూలే తెలిపారు. అలాగే అంబేద్కర్ పేరులో మార్పులు చేస్తానన్న యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై కూడా ఆమె ధ్వజం ఎత్తారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు