ప్రేమించుకున్న ఇద్దరు యువతీ యువకులు పరస్పర అంగీకారంతో లైంగిక జీవితం గడిపిన అనంతరం విభేదాలు తలెత్తిన నేపథ్యంలో యువతి అత్యాచారం కేసు పెడితే యువకుడిని దోషిగా నిర్థారించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆ జంట గాఢంగా ప్రేమించుకున్నట్లు ఆధారాలు లభిస్తే దాన్ని రేప్‌గా పరిగణించకూడదని ధర్మసనం తీర్పు వెల్లడించింది. కాగా ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువకుడిపై యువతి ఫిర్యాదు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. యోగేష్ పాలెకర్ అనే యువకుడు కేసినోలో పనిచేస్తుంటాడు. అక్కడే అతనికి ఓ యువతి పరిచయమైంది. కొద్ది కాలానికే ఇద్దరూ ప్రేమలోపడ్డారు. ఈ క్రమంలో ఓరోజు యోగేష్ తన కుటుంసభ్యులకు ఆమెను పరిచయం చేసేందుకు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో యోగేష్ ఇంట్లో ఎవరూ లేరు. ఆ రాత్రి యువతి కూడా అక్కడే ఉండిపోగా.. ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. మరుసటిరోజు ఉదయం ఆమెను అతను ఇంటి వద్ద దిగబెట్టి వచ్చాడు. ఆ తర్వాత పలుమార్లు అతని ఇంట్లోనే ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు.
అయితే ఆ యువతి తనను వివాహం చేసుకోవాలని కోరగా.. అతను నిరాకరించడంతో రేప్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కాబట్టే యోగేష్‌తో శృంగారానికి ఒప్పుకున్నానని, కానీ అతని మాయమాటలకు మోసపోయానని కేసులో పేర్కొంది. కేసును విచారించిన కోర్టు యోగేష్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ యోగేష్.. బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన జస్టిస్ సీవి భదంగ్ అతనికి అనుకూలంగా తీర్పునిచ్చారు.