TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. పెద్దల సభకు వెళ్లే ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఏపీ సీఎం జగన్ మాదిరే అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు కేసీఆర్. ముగ్గురు వ్యాపారవేత్తలను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. డా.బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావును టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
తెలంగాణ మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుండగా ఇద్దరు ఓసీలు, ఒక బీసీని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. బండి పార్థసారథి రెడ్డి హెటిరో గ్రూప్ చైర్మెన్ కాగా.. వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ వ్యాపారి. దీకొండ దామోదర్ రావు ప్రముఖ వ్యాపారవేత్త, నమస్తే తెలంగాణ ఎండీ. మొత్తం మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి వెలమ, ఒకటి రెడ్డి, మరొకటి మున్నూరు కాపుకు ఇచ్చారు కేసీఆర్. గతంలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు వ్యాపారవేత్తలనే ఎంపిక చేయడం చర్చగా మారింది.
దామోదర్ రావు మొదటి నుంచి సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్నారు. నమస్తే తెలంగాణ ఎండీగా ఉన్న దామోదర్ రావును రాజ్యసభకు పంపిస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రతిసారి ఆయనకు నిరాశే ఎదురైంది. ఈసారి మాత్రం అదృష్టం వరించింది.హెటిరో పార్థసారథి రెడ్డి పేరు కూడా పలు సార్లు తెరపైకి వచ్చింది. ఆయనను కూడా ఈసారి కరుణించారు కేసీఆర్. వద్దిరాజు రవిచంద్ర విషయంలో మాత్రం అందరిని ఆశ్చర్యపరిచారు కేసీఆర్. వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి.. ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ వియ్యంకుడే గాయత్రి రవి. ఆర్థికంగా బలంగా ఉన్నారు. వద్దిరాజు ఎంపికలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలుస్తోంది. తెలంగాణలో కాపులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. ఉత్తర తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికే చెందిన బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ది కూడా అదే సామాజిక వర్గం. సంజయ్, అర్వింద్ గెలిచాకా.. కాపులంతా బీజేపీకి మద్దతుగా ఉన్నారనే టాక్ ఉంది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రను రాజ్యసభకు కేసీఆర్ ఎంపిక చేశారని అంటున్నారు. రవిచంద్ర నియామకం ద్వారా కాపులను తమవైపు తిప్పుకోవాలని కేసీఆర్ స్కెచ్ వేశారని అంటున్నారు.
మరోవైపు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ సామాజిక న్యాయం పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ ఏకంగా రెండు సీట్లను బీసీలకు ఇచ్చారు. అందులో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఒకరు. కాని తెలంగాణలో మాత్రం ముగ్గురు బడా వ్యాపారులను కేసీఆర్ ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ అవమానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బండి ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు ఉప ఎన్నికతో పాటు డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మికాంతరావు పదవి కాలం ముగియడంతో ఎన్నిక జరుగుతోంది. బండా ప్రకాష్, డీఎస్ లు బీసీలు. కాబట్టి ఆ రెండు సీట్లను బీసీలకు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
READ ALSO: Dist Name Change:దిగొచ్చిన సీఎం జగన్! ఆ జిల్లా పేరు మారింది..
READ ALSO: Chandrababu Kadapa Tour: జగన్ ఇలాకాలో గర్జించిన చంద్రబాబు.. నియంతను తరిమికొడతామని వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook