ఆఫ్ఘనిస్థాన్‌లో ఓ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తోన్న ఏడుగురు భారతీయ ఇంజనీర్స్‌ను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఏడుగురు ఇంజనీర్స్ తాము పనిచేస్తోన్న విద్యుత్ కేంద్రానికి మిని బస్సులో వెళ్తుండగా ఆయుధాలు ధరించిన కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఆప్ఘనిస్థాన్ జాతీయుడైన ఆ బస్సు డ్రైవర్ సహా ఏడుగురు ఇంజనీర్స్‌ను అపహరించుకుపోయారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని బగ్లాన్ ప్రావిన్సులో ఆదివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనను భారత రాయబార కార్యాలయం సైతం ధృవీకరించింది. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు సేవలు అందిస్తోన్న ద ఆఫ్ఘనిస్థాన్ బ్రేష్మ షేర్కట్ (డ్యాబ్స్) అనే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తోన్న ఏడుగురు ఇంజనీర్స్ అపహరణకు గురైనట్టు భారత రాయబార కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. భారతీయ ఇంజనీర్లను విడిపించడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
ఇంజనీర్లు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ కలిపి ఆఫ్ఘనిస్థాన్ దేశ వ్యాప్తంగా మొత్తం 150 మంది భారతీయులు వివిధ సంస్థలకు సేవలు అందిస్తున్నట్టు ఈ సందర్భంగా భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది. భారతీయ ఇంజనీర్స్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు, వారి డిమాండ్లు ఏంటి అనే అంశంపై సరైన స్పష్టత లేదు. పేదరికం, నిరుద్యోగంతో విలవిల్లాడుతున్న ఆప్ఘనిస్థాన్‌లో డబ్బు కోసం కిడ్నాప్‌లు చేయడం సర్వ సాధారణం. అయితే, ఈ కిడ్నాప్ వెనుక తాలిబన్ల హస్తం వున్నట్టుగా పలు వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నప్పటికీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి వుంది.
#Breaking | Abduction took place around 10 AM local time #Afghanistan,
#Taliban is allegedly behind the abduction. Stay tuned for more details. pic.twitter.com/haVHC2QTp1— WION (@WIONews) May 6, 2018