Somalia Terror Attack: ఆఫ్రికా దేశం సోమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమాలియా రాజధాని మొగదిశులోని హయత్ హోటల్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని కాల్పుల మోత మోగించారు. బాంబు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పులు, బాంబు దాడుల్లో 40 మంది మృతి చెందగా 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు సోమాలియా భద్రతా దళాలు సుమారు 30 గంటల పాటు శ్రమించాయి. హయత్ హోటల్‌ను చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఎట్టకేలకు 30 గంటల తర్వాత ఆపరేషన్ ముగిసినట్లుగా ప్రకటించాయి.
అల్ ఖైదాతో సంబంధాలు కలిగిన అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ఈ మారణహోమానికి పాల్పడింది. శుక్రవారం (ఆగస్టు 19) రాత్రి హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు మూడుసార్లు బాంబు దాడులకు పాల్పడ్డారు. హోటల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు సహా పలువురు సాధారణ పౌరులను కాల్చి చంపారు. అంతకుముందు, హోటల్ బయట కూడా బాంబు దాడికి పాల్పడ్డారు. సోమాలియా భద్రతా దళాలు కౌంటర్ ఎటాక్‌కి దిగగా.. ఉగ్రవాదులు ఆ దాడులను తిప్పికొట్టారు. దీంతో భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సుమారు 30 గంటల పాటు చెమటోడ్చాల్సి వచ్చింది.
30 గంటల ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించినప్పటికీ.. ఇప్పటికీ హోటల్లో ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉన్నారా అనే అనుమానాలు లేకపోలేదు. ఆదివారం ఉదయం కూడా కాల్పుల శబ్ధాలు వినిపించడం ఈ అనుమానాలకు తావిచ్చాయి.
మొగదిశులోని హయత్ హోటల్ అక్కడి ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు అడ్డాగా చెబుతారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతోనే అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ఈ హోటల్‌ను ఆధీనంలోకి తీసుకుని మారణహోమానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థ గత 15 ఏళ్లుగా అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో షేక్ మహమ్మద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. సోమాలియాలో ఉగ్రవాదుల దాడిని అమెరికా, భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook