ప్రిన్స్ హ్యారీ పెళ్లి.. ముంబై డబ్బావాలాల సంబరాలు

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈనెల 19న హాలీవుడ్ నటి మేఘన్ మార్క్‌లేను పెళ్లి చేసుకోబోతున్నాడు.

Last Updated : May 14, 2018, 02:01 PM IST
ప్రిన్స్ హ్యారీ పెళ్లి.. ముంబై డబ్బావాలాల సంబరాలు

ముంబై : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈనెల 19న హాలీవుడ్ నటి మేఘన్ మార్క్‌లేను పెళ్లి చేసుకోబోతున్నాడు. బ్రిటన్‌ రాచమర్యాదల ప్రకారం వీరి పెళ్లి జరగనుంది. 2017 నవంబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే..! హ్యారీ కంటే మేఘన్‌ మూడేళ్లు పెద్ద. అంతేకాదు ఆమెకు ఇంతకు ముందే వివాహమైంది. ఇంగెల్సన్‌‌తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే 2016లో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది.

అయితే వీరి వివాహ సందర్భంగా డబ్బావాలాలు ముంబైలో సంబరాలు చేసుకుంటున్నారు. వారి వివాహానికి డబ్బావాలాలు స్వీట్లు పంచేందుకు రెడీ అవుతున్నారు. డబ్బావాలాల సంఘం ప్రతినిథి సుభాశ్ తలేకర్ మాట్లాడుతూ, బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీతో మాకు భావోద్వేగ సంబంధం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రిన్స్ చార్లెస్ తన వివాహానికి మమ్మల్ని ఆహ్వానించారు. మేము అక్కడ ఉన్నప్పుడు రాయల్ ఫ్యామిలీ మాకు ఎంతో గౌరవం ఇచ్చారు' అని అన్నారు. ప్రిన్స్ హారీ, మేఘన్ మార్క్‌లే వివాహం సందర్భంగా ఈ నెల 19న తాము టిఫిన్ డబ్బాలతో పాటు స్వీట్లను కూడా పంపిణీ చేస్తామని డబ్బావాలాల ప్రతినిధి చెప్పారు. అంతేకాకుండా బ్రిటీష్ కాన్సులేట్ ద్వారా వధూవరులకు సంప్రదాయ మహారాష్ట్ర పెళ్ళి దుస్తులను పంపిస్తామని అన్నారు.

ముంబై డబ్బావాలాల సర్వీసు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం విస్తరించింది. ముంబై డబ్బావాలాల గురించి హార్వర్డ్, బిజినెస్ స్కూల్ వంటి ప్రముఖ విదేశీ విశ్వ విద్యాలయాలు కూడా స్టడీ చేశాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ డబ్బా వాలాలు ప్రతి రోజూ సుమారు 200,000 లంచ్ బాక్స్‌లను నగరంలోని వివిధ ఆఫీస్‌లకు అందిస్తారు. వీరి నిర్వహణ చూసి తీరాల్సిందే. ముంబై డబ్బావాలాలు ఒకప్పుడు బ్రిటిష్ పాలకుల అవసరాలకు గాను ఈ రకంగా లంచ్ బాక్స్‌లు అందించేవారు. వీరు నేటికీ అదే పద్ధతిని క్రమశిక్షణతో కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. వీరి నిర్వహణా విధానం చూడాలంటే, ముంబయి చర్చి గేట్ రైల్వే స్టేషన్ వద్దకు ఉదయం 11.30 నుండి 12.30 గంటల మధ్య వెళ్లాలి. లంచ్ బాక్స్‌లు ట్రైన్‌లలో పెట్టి వాటిని సంబంధిత సిబ్బందికి అందించేందుకు ఆఫీస్‌‌లకు బయలుదేరుతారు.

 

Trending News