కర్నాటకలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగం బీజేపీ నేతలను ఇబ్బందుల్లో పడేసింది. బీజేపీ బద్దశత్రువుగా భావించే టిప్పుసుల్తాన్ ను ఆయన ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. వివరాల్లోకి వెళ్లినట్లయితే కర్నాటక విధానసౌధ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర పతి ప్రసంగించారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో టిప్పు సుల్తాన్ ను వీరుడిగా కీర్తించారు. బ్రిటీష్ వారితో పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీరోచితంగా మరణించారని పేర్కొన్నారు. చారిత్రక పోరాటంలో టిప్పు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
వాస్తవానికి ట్రిప్పు అనుసరించిన విధానాలకు బీజేపీ వ్యతిరేకం. కర్నాటక సర్కార్ నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను బీజేపీ వ్యతిరేకించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటని కర్నాటకకు చెందిన పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. మైసూర్ పాలకుడిగా వేలాది మంది హిందువులు, క్రిస్టియన్ లను టిప్పు సుల్తాన్ హతమార్చాడని... మత మార్పిడిలకు పాల్పడ్డాడని బీజేపీ ఎమ్మెల్యే అశ్వంత్ నారాయణ్ పేర్కొనడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు బీజేపీతో విభేదిస్తుండం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.