తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం జరగనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో జరిగే ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు కానున్న జోన్లు, మల్టీ జోన్లు, రైతుకు బీమా, ఉద్యోగుల బదిలీలు తదితర అంశాలపై చర్చిస్తారు. అలాగే జూన్ 2 న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్
ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు.
కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో ఎంపీ వినోద్‌తో కలిసి భేటీ అయ్యారు. ప్రకాష్ జవదేకర్‌కు గతంలో సీఎం కేసీఆర్ రాసిన లేఖను కేటీఆర్ ఆయనకు అందజేశారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆ లేఖలో కోరారు. అయితే, సీఎం రాసిన లేఖకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.